Amitesh Shukla on Rahul Gandhi:
నవ భారత మహాత్మా గాంధీ..
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపడుతున్నారు. ఇది అనైతికం అంటూ మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అమితేష్ శుక్లా రాహుల్‌ను మహాత్మా గాంధీతో పోల్చుతూ పలు కామెంట్స్ చేశారు. "నవ భారత మహాత్మా గాంధీ" అంటూ ఆయనను ఆకాశానికెత్తేశారు. 2018లో భారీ మెజార్టీతో గెలిచిన అమితేష్ శుక్లా...మహాత్మా గాంధీకి, రాహుల్ గాంధీకి వైఖరి పరంగా కొన్ని పోలికలున్నాయని అన్నారు.
"రాహుల్ గాంధీ నవ భారతానికి మహాత్మా గాంధీ లాంటి వాడు. చాలా విషయాల్లో మహాత్మా గాంధీతో ఆయనకు దగ్గరి పోలికలున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడితే..అప్పట్లో మహాత్మా గాంధీ దండి మార్చ్ నిర్వహించారు. రాహుల్ దేశానికి కొడుకు లాంటివాడు"
- అమితేష్ శుక్లా, కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఈ వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు శుక్లా. పూర్తి బాధ్యతతోనే ఈ కామెంట్స్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీజీ గురించి ఎన్నో విన్నానని, అవన్నీ రాహుల్‌లోనూ చూశానని వెల్లడించారు.
"నేను చాలా బాధ్యతాయుతంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. నేను స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబానికి చెందిన వాడిని. మా నాన్న, మా మామయ్య తరచూ మహాత్మా గాంధీజీ గొప్పదనం గురించి నాకు చెబుతుండే వారు. ఆ మహాత్ముడిలో ఉన్న లక్షణాలే కొన్ని రాహుల్ గాంధీలోనూ నాకు కనిపించాయి."
- అమితేష్ శుక్లా, కాంగ్రెస్ ఎమ్మెల్యే
మహాత్మా గాంధీజీ తలుచుకుని ఉంటే భారత్‌కు తొలి ప్రధాని అయ్యుండేవారన్న శుక్లా...అందుకు ఆయన ఆసక్తి చూపలేదని వెల్లడించారు. ఇదే విధంగా రాహుల్ గాంధీ కూడా 2004,2008లో ప్రధాని అయ్యే అవకాశమున్నా...ఆ పదవిపై ఆయన ఆసక్తి చూపించలేదని తెలిపారు. దండి మార్చ్‌లో భాగంగా మహాత్మా గాంధీజీ వేల కిలోమీటర్లు నడిచారని, రాహుల్ కూడా జోడో యాత్ర కోసం ఇదే విధంగా చేశారని స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. శుక్లా ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నారంటూ సెటైర్లు వేశారు.
"నిజం అనే ఆయుధంతోనే మహాత్మా గాంధీజీ బ్రిటిషర్ల పాలనకు చరమ గీతం పాడారు. రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా నిజానికి కట్టుబడి ఉన్నారు. అదానీ కుంభకోణం గురించి అందుకే మాట్లాడుతున్నారు"
- అమితేష్ శుక్లా, కాంగ్రెస్ ఎమ్మెల్యే
రాహుల్ అసహనం...
గతంలో రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేపదే గతం గురించి తవ్వుకోవడం మానేయాలని, ఇకపై ఏం చేయాలో ఆలోచించాలని సూచించారు. కొందరు తనను మహాత్మా గాంధీతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఇది చాలా తప్పు. మహాత్మా చేసిన పోరాటం వేరు. మనం చేస్తోంది వేరు. ఒకదానితో ఒకటి పోల్చడం సరికాదు. గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి. దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టారు. 10-12 ఏళ్లు జైల్లోనే ఉన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని ఇంకెవరూ చేయలేరు. ఆయన స్థాయినీ ఎవరూ అందుకోలేరు. ఆయనతో నన్ను పోల్చడం మానుకోండి" అని సున్నితంగానే పార్టీ కార్యకర్తలకు సూచించారు.
Also Read: Karnataka Elections 2023: దూకుడు మీదున్న కర్ణాటక కాంగ్రెస్, మరి కొందరి అభ్యర్థుల పేర్లు ఖరారు