Karnataka Elections 2023: 


42 మంది పేర్లు ఖరారు..


కర్ణాటక కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఇప్పటికే 124 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన ఆ పార్టీ..ఇప్పుడు రెండో విడత జాబితా విడుదల చేసింది. ఎన్నికల బరిలోకి దిగనున్న 42 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగిన తరవాత ఈ జాబితా విడుదల చేశారు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే పోటీ చేసే అవకాశమిస్తున్నట్టు ఖర్గే స్పష్టం చేశారు. గెలవకపోయినా... ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలిగే వారినే ఎంపిక చేస్తున్నామని తెలిపారు. మొదటి విడత జాబితాలో డీకే శివ కుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. గతంలోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా అదే స్థానాన్ని ఖరారు చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారు అన్న విషయంలో మాత్రం అధిష్ఠానం క్లారిటీ ఇవ్వడం లేదు. కొన్ని వర్గాలు సిద్దరామయ్య పేరు చెబుతుండగా...మరి కొందరు డీకే శివకుమార్‌ పేరు ప్రస్తావిస్తున్నారు.