Covid-19 Cases India:


రికార్డు స్థాయి కేసులు..


గత 24 గంటల్లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దాదాపు ఆర్నెల్లుగా కేసులు తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా...దాదాపు రెండు వారాలుగా మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 24 గంటల్లోనే 5,335 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేస్‌ లోడ్ 25,587గా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెల్లడించింది. గత 24 గంటల్లో లక్షా 60 వేల 742 శాంపిల్స్‌ టెస్ట్ చేయగా...వాటిలో 5,335 నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఈ వారంలోనే వైరస్ వ్యాప్తి పెరిగింది. బుధవారం నాటికి 4,435 కేసులు నమోదు కాగా..అంతకు ముందు మంగళవారం 3,038 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త కేసులతో మొత్తం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 47 లక్షలకు పెరిగింది. మొత్తం ఇన్‌ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.06%గా ఉన్నాయి. రికవరీ రేటు 98.75%గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బుధవారం (ఏప్రిల్ 5న) ఢిల్లీలో 509  కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 25%గా ఉండగా...అది 26.54%కి పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మేయర్ షెల్లీ ఒబెరాయ్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఢిల్లీలోని అన్ని ఆసుపత్రులు కరోనా తాకిడికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇప్పటికే పలు ఆసుపత్రులను సందర్శించారు మేయర్. అక్కడి వసతులను పరిశీలించారు. ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు సహా టెస్టింగ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయో సమీక్షించారు. 






ఈ రాష్ట్రాల్లో ఆంక్షలు..


ఢిల్లీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. ఈ జాబితాలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు కీలక ఆదేశాలిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. పంజాబ్ ఆరోగ్యమంత్రి బల్బీర్ సింగ్ కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా సోకిన వాళ్లెవరూ ICUలో లేరని స్పష్టం చేశారు. ఆక్సిజన్ ప్లాంట్‌లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్‌ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది. 


Also Read: Rahul Gandhi New House: బంగ్లా ఖాళీ చేస్తున్న రాహుల్ గాంధీ, తల్లి ఇంటికే షిఫ్ట్ అవుతున్నారట!