Chamchagiri Remark: రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు- మహిళా కమిషన్ సీరియస్!

ABP Desam Updated at: 06 Oct 2022 04:14 PM (IST)
Edited By: Murali Krishna

Chamchagiri Remark: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు- మహిళా కమిషన్ సీరియస్! ( Image Source : PIB | PTI )

NEXT PREV

Chamchagiri Remark: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తోంది. అయితే ఉదిత్ రాజ్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతిపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీతో సంబంధం లేదని ఆయన ట్వీట్ చేశారు.



ద్రౌపది ముర్మూజీపై నేను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నా వ్యక్తిగతం. దీంతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఒక ఆదివాసీగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు.  SC/ST వర్గానికి చెందిన వారు ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు తమ సామాజిక వర్గానికి మంచి చేయాలని మర్చిపోయి నిశ్శబ్దంగా ఉండిపోతుంటే బాధగా ఉంటుంది.                                                     -   ఉదిత్ రాజ్, కాంగ్రెస్ నేత


మరో ట్వీట్



ద్రౌపది ముర్ము జీకి రాష్ట్రపతిగా పూర్తి గౌరవం ఇస్తాం. ఆమె దళిత-ఆదివాసీ (కమ్యూనిటీ) ప్రతినిధి కూడా. కనుక ఆమెను ప్రశ్నించే హక్కు మాకు ఉంది. దానిని రాష్ట్రపతి పదవితో ముడిపెట్టకూడదు.                                             -   ఉదిత్ రాజ్, కాంగ్రెస్ నేత


ఇదీ జరిగింది


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 3న మన దేశంలో శ్వేత విప్లవం, ఉప్పు తయారీ గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. పాల ఉత్పత్తి, వినియోగంలో భారత దేశం ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె అన్నారు. అదే విధంగా మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఉప్పులో 76 శాతం గుజరాత్‌లో ఉత్పత్తి అవుతోందన్నారు. గుజరాత్‌లో ఉత్పత్తి అవుతున్న ఉప్పును భారతీయులంతా తింటున్నారని రాష్ట్రపతి అన్నారు. 


దీనిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ట్విట్టర్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.



ద్రౌపది ముర్ము వంటి రాష్ట్రపతి ఏ దేశానికీ ఉండకూడదు. చెమ్చాగిరి చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. 70 శాతం మంది ప్రజలు గుజరాత్ ఉప్పు తింటున్నారని ఆమె చెప్తున్నారు. జీవితమంతా మీరు ఉప్పు తింటూనే జీవిస్తే, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది.                                           - ఉదిత్ రాజ్, కాంగ్రెస్ నేత


ఎన్‌సీడబ్ల్యూ


ఉదిత్ రాజ్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ.. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్‌కు నోటిసులు పంపుతున్నట్లు తెలిపారు.



దేశ అత్యున్నత పదవికి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. కష్టపడి ఈ స్థానానికి చేరుకున్న ఒక మహిళకు వ్యతిరేకంగా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలుగా వీటిని పరిగణిస్తున్నాం. ఉదిత్ రాజ్.. తన అవమానకర వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎన్‌సీడబ్ల్యూ ఆయనకు నోటీసు పంపుతోంది.                                                -  రేఖా శర్మ, ఎన్‌సీడబ్ల్యూ ఛైర్మన్


Also Read: Viral video: రోడ్డుపై రావణుడి బ్రేక్ డ్యాన్స్- 'ఆదిపురుష్'లో అవకాశం ఇవ్వండయా!


Also Read: Thailand Mass Shooting: చైల్డ్ కేర్ సెంటర్‌పై దుండగుడి కాల్పులు- 34 మంది మృతి!


 

Published at: 06 Oct 2022 04:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.