మూడున్నరేళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం అని, ఇలానే కొనసాగితే ఏపీ మరో నైజీరియాలా మారుతుందని టీడీపీ శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని, అభివృద్ధి అటకెక్కించారని ఆరోపించారు. వ్యవసాయం నుంచి వృత్తులు, వ్యాపారాలు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వందలాది వృత్తుల్లోని ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైందని వ్యాఖ్యానించారు యనమల. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ అంధకారం కావడం ఖాయమన్నారు. ప్రజలపై భారాలు, నిలిచిపోయిన అభివృద్ధితో నైజీరియా, జింబాంబ్వే కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందన్నారు.
తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వ అప్పులు అసాధారణంగా పెరిగాయని, మూల ధన వ్యయం మాత్రం దారుణంగా తగ్గిపోయిందన్నారు యనమల. రెవెన్యూ పడిపోయి, జీ.ఎస్.డి.పి, తలసరి ఆదాయం సింగిల్ డిజిట్‌కు దిగజారాయని తెలిపారు. ఓపెన్ బారోయింగ్స్ 130% పైగా పెరిగి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.4 లక్షల కోట్ల వరకు చేరిందని చెప్పారు. అప్పుల్ని బడ్జెట్‌లో చూపించకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఈ చర్యలను 15వ ఆర్ధిక సంఘం తప్పుపట్టిందని వివరించారు.
మూడున్నర సంవత్సరాల్లో రూ.8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని, అయినా ప్రజల ఆదాయం పెరగలేదని, అభివృద్ధీ జరగలేదన్నారు యనమల. ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయం ఎటు పోతోందో కూడా లెక్కల్లేవని, ప్రభుత్వం ఎడా పెడా చేస్తున్న అప్పులకు, వచ్చే ఆదాయానికి సంబంధం లేకుండా పోయిందని ద్వజమెత్తారు. ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పుల కారణంగా ప్రస్తుతం సంవత్సరానికి రూ.50వేల కోట్లకుపైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోందని వెల్లడించారు. భవిష్యత్తులో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు చేరే ప్రమాదం ఉందని, లక్ష కోట్లు వడ్డీలే చెల్లిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో, ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎఫ్.ఆర్.బి.ఎం చట్టం ప్రకారం రాష్ట్ర అప్పులు జి.ఎస్.డి.పిలో 35% మించకూడదని, కానీ వైసీపీ ప్రభుత్వం 2021 మార్చి నాటికి చేసిన అప్పులు 44.04శాతానికి చేరుకున్నాయని తెలిపారు. అప్పులు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడమంటే రాష్ట్ర ఆర్ధికస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పడం కాదా అని యనమల ప్రశ్నించారు. తీసుకున్న అప్పుల్లో దాదాపు 81 శాతం సొమ్మును కేవలం రెవెన్యూ ఖర్చుల కోసం వినియోగించడం, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు..
మూడున్నరేళ్లలో రాష్ట్ర తలసరి అప్పు రూ.67 వేలకు చేరిందని,2020-21 ఆర్ధిక సంవత్సరంలో 331 రోజులు అప్పులు చేయాల్సి రావడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు అద్దం పడుతోందన్నారు యనమల. రిజర్వు బ్యాంకు వద్ద రాష్ట్రం ఉంచాల్సిన కనీస నగదు నిల్వ రూ.1.94 కోట్లు 330 రోజులకుపైగా మెయింటైన్ చేయలేకపోయారని వివరించారు. గతంలో రాష్ట్రం ఎన్నడూ ఎదుర్కోని స్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగిందని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, పండగ పూట కూడా పస్తులుండే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, ఆర్ధిక అసమానతలు తీవ్రమయ్యాయని, పేదరికం, నిరుద్యోగం పెరిగి, రాష్ట్రం అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు లేవు...
గతంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, పెట్టుబడుల ఆకర్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు లోటు లేకుండా ఉండేదని, స్వయం ఉపాధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు యనమల. డ్వాక్రా వ్యవస్థకు రూ.10 లక్షల వరకు రుణాలు అందడంతో సుమారు కోటి మంది మహిళలు స్వయం ఉపాధి సాధించేలా ముందడుగులు వేశారని, కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు రాష్ట్ర వాటా కలిపి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని పేద యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడు కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రశ్నార్ధకమైందని, ఉన్న పరిశ్రమలను కమీషన్ల కోసం బెదిరిస్తుండడంతో పెట్టుబడులు ఉపసంహరణలు పెరిగాయని ఆరోపించారు.
విశాఖలో ఏర్పాటు కావాల్సిన లులూ, అదానీ డేటా సెంటర్, ప్రకాశం జిల్లా నుంచి ఏసియన్ పల్ప్ పేపర్ మిల్, కియా అనుబంధ సంస్థలు సహా ఎన్నో ప్రఖ్యాత కంపెనీలతో దక్కాల్సిన ఉపాధి రాష్ట్ర ప్రజలకు దూరం చేశారని ఆరోపించారు యనమల. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగ విప్లవం హామీని గాలికి వదిలేశారని, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ వంటి సంస్థల విషయంలో మాట తప్పి మడమ తిప్పి.. ప్రజల్ని మోసం చేశారనిన యనమల వ్యాఖ్యానించారు.