Central Health Ministry issued a show cause notice to a ghee-supplying company : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసిన వ్యవహారంలో ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. వివాదం ప్రారంభమైన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ.. తిరుమలకు నెయ్యిని సరఫరా చేసే నాలుగు కంపెనీల శాంపిల్స్ ను తెప్పించుకుని పరీక్షలు చేసింది. అందులో మూడు కంపెనీల నెయ్యి ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నా ఓ కంపెనీ మాత్రం.. కల్తీ చేసినట్లుగా తేలింది. ఆ కంపెనీ ఏమిటన్నది పేరు బయటపెట్టలేదు కానీ.. ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  






తిరుమలకు లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా కేంద్రం కూడా తేల్చడంతో .. ఈ అంశంలో కీలక నిర్ణయాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తం నాలుగు కంపెనీల శాంపిల్స్ పరీక్షిస్తే ఒక్క కంపెనీ మత్రమే కల్తీ చేసినట్లుగా గుర్తించారు. అయితే వివాదం బయటపడిన తర్వాత ఆ శాంపిల్స్ పంపించారు కాబట్టి.. ఇతర కంపెనీలు జాగ్రత్త పడి ఉంటాయని.. అప్పటికే తిరుమలలో ఉన్న స్టాక్ నుంచి .. శాంపిల్స్ పంపించడం వల్ల.. ఆ ఒక్క కంపెనీ దొరికిపోయిందని భావిస్తున్నారు. ఆ కంపెనీ ఏదన్నదానిపై స్పష్టత లేదు. కానీ తమిళనాడులోని ఏ ఆర్ ఫుడ్స్.. అతి తక్కువగా రూ. 320కే కేజీ ఆవు నెయ్యిని పంపిణీ చేస్తోంది. అంత తక్కువకు సరఫరా చేస్తున్నందున..  కల్తీ చేసి పంపుతున్నారని అనుమానిస్తున్నారు. టీటీడీ కూడా ఈ కంపెనీ తెచ్చిన  నెయ్యిలోనే కల్తీ ఉందని టెస్టులు చేసి ప్రకటించింది. 


నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !


అయితే ఏఆర్ డెయిరీ మాత్రం తమ నెయ్యి స్వచ్చమైనదని.. ఏ టెస్టులకైనా సిద్దమని  చెబుతోంది. తాము కూడా టెస్టులు చేయించామని.. కొన్ని ల్యాబ్ రిపోర్టులు వెలుగులోకి తెచ్చింది. అయితే తమిళనాడు అధికారులు ఆ కంపెనీపై రెయిడ్స్ చేశారు. ఆ కంపెనీ నుంచి ఏ ఆలయానికీ నెయ్యి కొనవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ ఏఆర్ ఫుడ్స్ నెయ్యిలోనే కల్తీ  బయటపడినట్లయితే.. ఆ కంపెనీని పూర్తి స్థాయిలో  బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే టీటీడీ ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. కల్తీ నెయ్యి సరఫరా చేసినందున.. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటించింది.                          


'శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి' - భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి