Boddemma Celebrations 2024 : తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు దాదాపు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటివాటిలో బొడ్డెమ్మ ఒకటి. బోనాలు, బతుకమ్మ పండుగలు ఎంత విశిష్టమైనవో.. బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధన్యత ఉంది. అయితే దీనిని కూడా మహిళలే చేసుకుంటారు. బొట్టె, బొడ్డె అంటే చిన్న అని. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు దీనిని చేసుకుంటారు. ఇది కూడా మట్టి, పూలతో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమైపోయాయి. ఆదివారం నుంచి బొడ్డెమ్మను చేస్తున్నారు.
భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకొంటారు. ఈ మట్టి పూల పండుగను బాలికలు చేసుకుంటారు. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు చేసుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు యువతుల జీవన విధానం, ప్రకృతి, గౌరీదేవిపై పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తుంటారు. తొమ్మిదవ రోజు రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు.
కొందరు నోము కూడా చేస్తారు
బొడ్డెమ్మను కాలనీలో లేదా గల్లిలో ఆనవాయితీగా చేసే చోట మాత్రమే బొడ్డెమ్మను (వేస్తారు) రూపొందిస్తారు. చుట్టుపక్కల బాలికలంతా బొడ్డెమ్మ ఆటపాటల్లో పాల్గొంటారు. కొన్ని కుటుంబాల్లో దీనిని ఒక నోముగా చేసుకుంటారు. బాలికలకు మూడు లేదా 5వ ఏట నుంచి.. ప్రారంభించి ఈ నోమును యుక్తవయసు వచ్చేవరకు చేస్తారు. అమ్మాయికి పెళ్లి కావాలని, వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవికి చేసే నోము ఇది.
బొడ్డెమ్మను ఎలా చేస్తారంటే..
బొడ్డెమ్మను వేసేవారు చెరువు దగ్గరకు వెళ్లి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులుగా పేరుస్తారు. ఆపైన ఒక చెంబు, ఆ పైన జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోస్తారు. ప్రతి రోజు అనగా తొమ్మిది రోజులు సాయంత్రం ఎర్రమట్టి అలికి.. బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో పాటు సహజ సిద్ధంగా దొరికే పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా తొమ్మిది రోజులు చేస్తారు. దాని చుట్టూ కోలాటాలతో పాటలు పాడుతూ పూజలు చేస్తారు.
సంధ్యా సమయంలో దేవతలు ఇంటిలోకి వస్తారనే విశ్వాసంతో ఈ ఆట ఆడతారు. పూజలో రోజుకొక రకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బొడ్డమ్మ చుట్టూ చేరి.. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. అవి ముగిశాక అందరూ చుట్టూ కూర్చొని నిద్రపో బొడ్డెమ్మ... నిద్రపోమ్మా. నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతారు.
పేర్లు వేరైనా.. అమ్మ ఒక్కతే..
బొడ్డెమ్మను.. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను పీటపై చేసి కొందరు పందిరి వేస్తారు. తొమ్మిది రోజుల ఉత్సవంలో చివరిరోజు.. బియ్యంతో కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యం పెడతారు. అనంతరం అమ్మాయిలకు తినిపిస్తారు. చివరి రోజు గౌరమ్మను చేసి.. పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజించి.. పాటలు పాడి ఆడిన తర్వాత చెరువులో పోయిరా బొడ్డెమ్మ.. అంటూ నిమజ్జనం పూర్తి చేస్తారు.
మరుసటి రోజు నుంచే బతుకమ్మ..
బొడ్డెమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు అనగా మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. దానిని కూడా తొమ్మిదిరోజులు చేస్తారు. ఇది ముగిసే సరికి దసరా వస్తుంది. ఇలా దాదాపు ఇరవై రోజులకు పైగా పండుగ వాతావరణం ఉంటుంది. ఆడవారు ఈ మూడు పండుగల్లో గౌరి దేవిని కామన్‌గా పూజిస్తారు. కానీ వివిధ పేర్లతో కొలుచుకుంటారంతే..
Also Read : బతుకమ్మని ఎప్పటినుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా? చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతలు ఇవే