Devara Pre Release Event Cancelled: మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఫ్యాన్స్ ఊహించని సంఖ్యలో వేదిక వద్దకు రావడంతో ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియాపై విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందనే విషయం గురించి ఈ సంస్థ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్ నోట్‌లో ఈ కింద తెలిపిన విధంగా పేర్కొన్నారు
‘డియర్ ఫ్యాన్స్,
నిన్న రాత్రి దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర జరిగిన దురదృష్టకర సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాం. ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా విడుదల కావడం గురించి, మీ అందరికీ ఆయన మీద ఉన్న ప్రేమ గురించి మేం అర్థం చేసుకున్నాం. మీలో ఎంతో మంది నిరాశ చెందారని తెలిసి మేం ఈ నోట్‌ను ఎంతో బరువెక్కిన గుండెతో విడుదల చేస్తున్నాం.
ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఎంపిక చేయడం గురించి మీరు ఏమన్నారో మేం చూశాం. అసలేం జరిగిందో ఇప్పుడు చెప్తున్నాం.
ఈ ఈవెంట్ ఎంత స్పెషల్ అనే సంగతి మాకు తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో కూడా మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మంచి అవుట్‌డోర్ వేదికను ఎంపిక చేయాలనే మేం కూడా అనుకున్నాం. కానీ రెండు కారణాల వల్ల పెద్ద స్థాయి అవుట్ డోర్ ఈవెంట్స్‌కు పోలీస్ పర్మిషన్లు లభించలేదు.
1. గణేష్ నిమజ్జన వేడుకల సమయంలోనే ఈవెంట్ నిర్వహించాల్సి వచ్చింది. గణేష్ నిమజ్జనానికి పెద్ద స్థాయిలో పోలీసుల అవసరం ఉంటుంది.
2. భారీ వర్షం పడే అవకాశం ఉన్న కారణంగా అవుట్ డోర్‌లో వేడుక నిర్వహించడం అంత సులభం కాదు.
ఇన్ని సవాళ్ల మధ్యలో కూడా అవుట్ డోర్ వేదిక కోసం మేమెంతో ప్రయత్నించాం. కానీ మాకు కావాల్సిన అనుమతులు రాలేదు. దీని కారణంగా నోవోటెల్‌లో హాల్ 3 నుంచి 6 వరకు బుక్ చేశాం. వీటి సామర్థ్యం 5500 మంది వరకు ఉంటుంది. 4000 మంది హాజరవ్వడానికి పోలీసుల అనుమతి కూడా తీసుకున్నాం. మేం ఈ లిమిట్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నాం.
పాసెస్, క్రౌడ్ మేనేజ్‌మెంట్
పాసులను డూప్లికేట్ చేయకుండా ఉండటానికి ఐడీ కార్డు తరహా పాస్‌లను, ఇచ్చిన అనుమతుల పరిధిలోనే నాలుగు వేలకు మించకుండా ప్రింట్ చేశాం. రెగ్యులర్ పాస్‌లను ప్రింట్ చేయలేదు. అనుమతులు ఇచ్చిన దాని కంటే ఎక్కువ పాస్‌లు ప్రింట్ చేశామన్న పుకార్లు పూర్తిగా అబద్ధం.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అంచనాలు వేసిన దానికంటే ఎక్కువగా ఫ్యాన్స్ సముద్రంగా వేదిక వద్దకు వచ్చారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది వరకు అభిమానులు వచ్చారు. ఈ కారణంగా ప్రతి గేట్ వద్ద భారీగా జనం పోగయ్యారు. బ్యారికేడ్లు విరిగిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోయింది. నది లాంటి చిన్న వేదిక దగ్గరకి సముద్రంలా ఫ్యాన్స్ రావడం, ఎన్టీఆర్‌పై ఆయన అభిమానులకు ఉన్న ప్రేమను చూపిస్తుంది.
భద్రత కోసమే క్యాన్సిల్
ఫ్యాన్స్ అందరి రక్షణ కోసం ఈవెంట్ క్యాన్సిల్ చేయాలనే కఠినమైన నిర్ణయాన్ని మేం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒక బాధాకరమైన నిర్ణయం కానీ అక్కడికి వచ్చిన వారి రక్షణే అన్నిటి కంటే ముఖ్యమైనది.
భారీ స్థాయి ఈవెంట్స్ నిర్వహించడంలో శ్రేయాస్ మీడియాకు ఎంతో అనుభవం ఉంది. అవుట్ డోర్ వేదికల్లో రెండు నుంచి మూడు లక్షల మందిని కూడా మేం గతంలో మేనేజ్ చేశాం. ఎన్నో భారీ ఈవెంట్లను కూడా గతంలో నిర్వహించాం. కానీ ప్రతీ ఈవెంట్ నిర్వహణలోనూ కొన్ని సవాళ్లు ఉంటాయి. ఏ కార్యక్రమంలో అయినా మేం ఫ్యాన్స్ రక్షణ, సంతృప్తికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం.
క్షమాపణ
మీలో చాలా మంది ఎంతో దూరంలో నుంచి వచ్చారని తెలుసు. దేవర వేడుకలను చూడటానికి ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నారని కూడా తెలుసు. మీకు కలిగిన అసౌకర్యానికి, నిరాశకు మేం క్షమాపణలు చెప్తున్నాం. మీ అందరికీ ఒక మంచి అనుభవాన్ని అందించాలని అనుకున్నాం. కానీ మేం అనుకున్నట్లు ఈవెంట్ జరగలేదు.
ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా జరిపేందుకు 100కి పైగా యూట్యూబ్ ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేశాం. దీని కారణంగా ఫ్యాన్స్ అందరూ మ్యాజిక్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండవచ్చు. కానీ పరిస్థితులు అదుపు తప్పడం కారణంగా మేం భద్రతకే ప్రాధాన్యత ఇచ్చాం.
మీరంతా ఎన్టీఆర్‌ను ఎంత ప్రేమిస్తున్నారో మా అందరికీ తెలుసు. మీ ప్రేమకి ఈ ఈవెంట్ ఒక సాక్ష్యం. ఈ కార్యక్రమం అనుకున్న విధంగా జరగకపోయినా... ఈ ఎనర్జీ, ప్యాషన్ మమ్మల్ని ముందుకు వెళ్లేందుకు దోహదపడతాయి. ఎన్టీఆర్‌పై మీకున్న ప్రేమను మళ్లీ సెలబ్రేట్ చేస్తాం. ఈసారి మరింత బలంగా కమ్‌బ్యాక్ ఇస్తాం.
ఫ్యాన్స్ కోసం...
మీరు ఇస్తున్న సపోర్ట్, మీ డెడికేషన్ ఎన్టీఆర్‌ను మాన్ ఆఫ్ మాసెస్‌గా మార్చాయి. మీరు అందించే ప్రేమ, భక్తిని ఈ ప్రపంచంలో మరేదీ మ్యాచ్ చేయలేదని చెప్పటానికి నిన్న రాత్రి సముద్రంలా వచ్చిన ఫ్యాన్సే ఒక ఉదాహరణ. ఈ ప్రయాణంలో మీతో భాగం అయినందుకు మేం అంతా చాలా గర్వపడుతున్నాం. మీ ప్యాషన్‌ను మ్యాచ్ చేసేందుకు మేం కష్టపడి పని చేస్తూనే ఉంటాం.
ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా మాతో నిలబడ్డ శ్రేయోభిలాషులకు, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. మీ మద్దతు మాకు చాలా సంతోషాన్ని ఇచస్తుంది.
ఎంతో బాధతో, కృతజ్ఞతతో
శ్రేయాస్ మీడియా’
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం ఇప్పట్లో చల్లారేలా లేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బియాండ్ ఫెస్ట్ వేడుకలో ‘దేవర’ స్క్రీనింగ్ కోసం అమెరికాకు వెళ్లిపోయారు. ఇంక ‘దేవర’ ప్రమోషన్లకు ఫుల్‌స్టాప్ పడినట్లే అనుకోవచ్చు.