Organ Donation Leaves:
42 రోజులకు పొడిగింపు
అవయవ దానంపై కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పలు సందర్భాల్లో దీనిపై ప్రస్తావించారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దానం చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల స్పెషల్ లీవ్స్ ఇవ్వనుంది. ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా పెద్ద సర్జరీ. దాన్నుంచి రికవరీ అవడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ సెలవుల గడువు 30 రోజులు ఉండగా..దాన్ని 42 రోజులకు పొడిగించింది.
"అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చిన వ్యక్తి నుంచి ఆ ఆర్గాన్ తొలగించడం అనేది చాలా కష్టమైన సర్జరీ. రికవర్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడే కాదు. ఆసుపత్రి నుంచి వచ్చిన తరవాత కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం"
- కేంద్ర ప్రభుత్వం
వైద్యులు ధ్రువీకరిస్తేనే..
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు చొరవ చూపించిన ఉద్యోగులకు ఈ సెలవులు ఇవ్వడం కనీస గౌరవం అని కేంద్రం భావిస్తోంది. అందుకే 42 రోజుల పాటు ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. అది ఎలాంటి సర్జరీ అయినా సరే...గరిష్ఠంగా 42 రోజుల పాటు సెలవులు తీసుకునే అవకాశముంటుంది. అయితే...ప్రభుత్వ గుర్తింపు పొందిన మెడికల్ ప్రాక్టీషనర్ సూచన మేరకూ ఈ సెలవులు ఇస్తారు. అంటే...అతడి నుంచి అధికారికంగా ఓ లెటర్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. Transplantation of Human Organs Act 1994 ప్రకారం ఏదైనా వ్యక్తి నిబంధనలకు లోబడి అవయవ దానం చేయడానికి ముందుకొస్తే వాళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన తరవాతే ఈ నిర్ణయం తీసుకన్నట్టు Personnel Ministry వెల్లడించింది. హాస్పిటల్‌లో అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచే ఈ సెలవులు కౌంట్‌లోకి వస్తాయి. మరో కండీషన్ ఏంటంటే...ఒకేసారి ఈ సెలవులు తీసుకోవాలి. ఏమైనా అత్యవసర పరిస్థితులు వస్తే డాక్టర్ రికమెండేషన్ మేరకు మరో వారం రోజులు పొడిగిస్తారు. అంత కన్నా ఎక్కువ అయితే సెలవులు పెట్టడానికి వీలుండదు. ఈ విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకూడదని భావిస్తోంది కేంద్రం.
పాలసీలో మార్పులు..
ఇటీవలే అవయవ దానం విషయంలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. వన్ నేషన్, వన్ పాలసీలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. అవయవదానంతో పాటు అవయవ మార్పిడిలోనూ మార్పులు చేర్పులు చేసింది. 65 ఏళ్లు పైబడిన రోగులెవరైనా చనిపోయిన వాళ్ల నుంచి "అవయవం పొందేందుకు" వీలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. గతంలో ఈ వయో పరిమితి 65గా ఉండేది. ఇప్పుడు 65 ఏళ్లు దాటిన వాళ్లు కూడా అవయవాలు పొందేందుకు అవకాశముంటుంది. 65 ఏళ్ల వాళ్లను ఈ విషయంలో "వృద్ధులుగా" పరిగణించడం సరి కాదని, అందుకే మార్పులు చేశామని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే...ఎక్కువ కాలం బతికుండే అవకాశమున్న యువతీ, యువకులకు అధిక ప్రాధాన్యతనిస్తామని వెల్లడించింది. మొత్తానికైతే...ఇప్పుడు ఎవరైనా సరే చనిపోయిన వారి నుంచి అవయవాలు తీసుకునేందుకు "రిజిస్టర్" చేసుకోవచ్చు. NOTTO వెబ్‌సైట్‌లో ఈ కొత్త గైడ్‌లైన్స్‌ని అప్‌డేట్ చేశారు. అవయవాలు తీసుకునేందుకు రిజిస్టర్ చేసుకునే వాళ్లకు ఎలాంటి ఫీజ్ వసూలు చేయరు.
Also Read: ప్రధాని మోదీ ఓ విషసర్పం లాంటి వాడు, ముట్టుకుంటే చావడం ఖాయం - ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు