Karnataka Assembly Elections 2023: 


ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు 


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విషసర్పం అని, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. మరి కొద్ది రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో భాగంగా కలబుర్గిలో ఖర్గే మాట్లాడారు. ఆ సమయంలోనే ఇలా నోరు జారారు. 


"ప్రధాని నరేంద్ర మోదీ ఓ విషసర్పం లాంటి వాడు. అది విషమా కాదా అని రుచి చూశారా..? ఇక అంతే. ఆ విషం ఎక్కి వెంటనే చచ్చిపోతారు" 


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 






ఈ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది. ఇప్పటికే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కాస్త గట్టిగానే బదులిచ్చారు. ఇంత కన్నా దారుణమైన కామెంట్స్ ఇంకేవీ ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"గతంలో సోనియా గాంధీ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జీవితాలతో ఆడుకునే వ్యక్తి అంటూ ఏవేవో మాట్లాడారు. అవే దారుణం అనుకుంటే...ఇప్పుడు ఖర్గే చేసిన కామెంట్స్ అంత కన్నా దారుణంగా ఉన్నాయి. కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గేని అధ్యక్షుడిని చేసింది. కానీ పార్టీ నేతలు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదు. సోనియా గాంధీ కన్నా దిగజారుడు విమర్శలు చేస్తే తనను అందరూ పట్టింకుంటారని అనుకుంటున్నారేమో"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 


మరో కేంద్రమంత్రి శోభ కరండ్లజే కూడా ఖర్గే కామెంట్స్‌పై స్పందించారు. ఖర్గే లాంటి సీనియర్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. దేశ ప్రధానిని ఇలా కించపరచడం సరికాదని మండి పడ్డారు. 


"మల్లికార్జున్ ఖర్గే ఓ సీనియర్ నేత. కాంగ్రెస్ అధ్యక్షుడు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి దేశ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ కామెంట్స్‌తో దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు..? ప్రపంచమంతా మోదీకి గౌరవమిస్తోంది. మీరు వాడిన  భాష వింటేనే అర్థమవుతోంది ఎంతలా దిగజారిపోయారో అని. ఖర్గే కచ్చితంగా దేశానికి క్షమాపణలు చెప్పాలి"


- శోభ కరండ్లజే, కేంద్రమంత్రి 


బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ప్రధాని మోదీ గురించి మాట్లాడలేదని, కేవలం బీజేపీ ఐడియాలజీ గురించి మాత్రమే కామెంట్ చేశానని అన్నారు. వాళ్ల ఐడియాలజీ విషపూరితమైన పాము లాంటిదని, ముట్టుకుంటే కాటుకు గురి కాక తప్పదని అన్నట్టు వివరించారు.