Supreme Court News : ఈడీ విచారణ అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలంటూ ఆమె తరపు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయొచ్చా అనే అంశాన్ని సవాల్ చేస్తూ గతంలో కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే సోమవారం కవిత పిటిషన్ విచారించాలని ధర్మాసనానికి కపిల్ సిబల్ ...జస్టిస్ రస్తోగి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థనను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. అయితే ఖచ్చితంగా విచారణ జరుపుతామని చెప్పలేదు. కాలికి గాయం కావడంతో ప్రస్తుతం కవిత విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో గత నెలలో విచారణ జరిగింది. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. కవిత తన పిటిషన్‌లో మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు.
వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్‌లో కోరారు. తన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, జారీ చేసిన జప్తు నోటీసులను రద్దు చేయడంతో పాటు.. ఫోన్‌ను సీజ్ చేయడం చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌ను నళినీ చిదంబరం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసుకు జత చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తొలుత శుక్రవారం విచారణ జరుపుతామని చెప్పినా.. ఆ తర్వాత తదుపరి విచారణ తేదీని 27గా ప్రకటించింది. కాగా.. కవిత ఇప్పటికే ఈడీ ఎదుట మూడుసార్లు హాజరై.. తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
సాక్షిగా పిలిచిన మహిళను తమ ఇంటి వద్ద లేదా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని పిటిషన్‌లో కవిత కోరారు. సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉల్లఘించి... తనని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని కవిత పేర్కొన్నారు. విచారణ సందర్భంగా... ఈడీ అధికారులు మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. గతంలో పలు ఉదాహరణలు ఉన్నాయని కవిత తెలిపారు. ఈడీ అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేసిందని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈడీ అధికారులు కొంత మంది నిందితుల పట్ల ప్రవర్తించిన తీరు తనని ఆందోళనకు, భయానికి గురి చేస్తోందని తెలిపారు. న్యాయవాదుల సమక్షంలో, సీసీ టీవీ కెమెరాల నిఘాల్లోనే విచారణ చేపట్టేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.