నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మావోయిస్టు దంపతులు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేర‌కు కాసరనేని రవికుమార్ అలియాస్ అజిత్, ఆలియాస్ మున్నా, ఆలియాస్ సూర్యా, అత‌డి భార్య మడివి సోమిడి అలియాస్ కల్పనను మీడియా ఎదుట ప్రవేశ‌పెట్టారు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన కాసరనేని రవికుమార్ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ మెంబర్,మణుగూరు ఎల్.ఓ.ఎస్ కమాండర్‌గా ఉన్నాడు. అత‌డి భార్య మడివి సోమిడి చర్ల మండలానికి చెందిన‌వారు. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పాల్వంచ ఏరియా కమిటీ మెంబర్‌గా, మణుగూరు ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్‌గా కొన‌సాగుతున్నారు. కాగా విప్లవ సిద్ధాంతాలు న‌చ్చకపోవ‌డంతోపాటు అనారోగ్యం కార‌ణంగా లొంగిపోయిన‌ట్లు సీపీ వెల్లడించారు.


ర‌వి కుమార్ ప్రస్థానం..


స్వగ్రామంలో పదో తరగతి వరకు చదువుకున్న రవి కుమార్ ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువును మధ్యలోనే ఆపివేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తమ బంధువుల ఇంటిలో కొద్ది సంవత్సరాలు నివాసం వున్నాడు. ఇదే సమయంలో విప్లవ భావాలు కలిగి గ‌ల రవికుమార్ 2012 సంవత్సరంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ డ్రేడ్ యూనియన్లో జాయిన్ అయ్యాడు. అనంతరం కొద్ది రోజులకు కొత్తగూడెం కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎంపికకై ఆతర్వాత పీడీఎస్‌యూలో చేరాడు. 2016 సంవత్సరంలో మావోయి స్టుల సిద్ధాంతాలకు ఆకర్షితుడై రవికుమార్ తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ పోత్సహంతో పార్టీ సభ్యుడిగా చేరారు. చర్ల ఏరియా కమాండర్ సోడి జోగయ్య నాయకత్వంలో పనిచేశాడు. 2017 సంవత్సరంలో డిప్యూటీ కమాండర్ గా పనిచేసిన రవికుమార్ 2019 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ మణుగూరు ఎల్.ఓ.ఎస్ ఏసీఎం మడవి సోమిడి అలియాస్ కల్పనను వివాహం చేసుకున్నాడు. రవికుమార్‌పై ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది.


మడివి సామిడి అలియాస్ కల్పన ప్రస్థానం..


మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలైన కల్పన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరింది. 2018 సంవత్సరంలో చర్ల ఎల్.ఓ.ఎస్ సభ్యురాలిగా, 2020 సంవత్సరంలో ఏసిఎం, మణుగూరు ఎలోఓఎస్. డిప్యూటీ కమాండర్‌గా పనిచేసింది. 2021 సంవత్సరంలో సుక్మా జిల్లా, జీరమతీ గ్రామంలో పోలీసు బలగాలపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితురాలు. ఈమెపై రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.