Anand Mohan Singh:


ఆనంద్ మోహన్ విడుదల 


మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ సింగ్‌ను జైలు నుంచి విడుదల చేయడం దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. జైలు చట్టాల్ని మార్చేసి మరీ అతడిని బయటకు తీసుకురావడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. IAS జి. కృష్ణయ్య హత్య కేసులో శిక్ష పడిన ఆనంద్ మోహన్‌ మరి కొన్నాళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి ఉంది. కానీ బిహార్ ప్రభుత్వం జైలు చట్టాల్లో మార్పు చేయడం వల్ల త్వరగా విడుదల చేయాల్సి వచ్చింది. డ్యూటీలో ఉన్న ఓ కలెక్టర్‌ని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఇలా ముందస్తు విడుదల చేయడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ నితీష్ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్నిసమర్థించుకున్నాయి. ఈ కారణం చూపించి "ముందస్తు విడుదలకు అనర్హుడు" అని తేల్చలేమని వివరిస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీనిపై ఇప్పటికే మాటల యుద్ధం మొదలు పెట్టింది. జి కృష్ణయ్య భార్య కూడా ఆనంద్ మోహన్‌ని విడుదల చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ "విడుదల"తో బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. రాజ్‌పుత్ ఓట్లను రాబట్టుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. 


ఎవరీ ఆనంద్ మోహన్..? 


1990లో రాజకీయాల్లోకి వచ్చారు ఆనంద్ మోహన్ సింగ్. జనతా దళ్ పార్టీ నుంచి పోటీ చేశారు. హమ్హిషి నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. అప్పటికి నితీష్ కుమార్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ జనతా దళ్‌లోనే ఉన్నారు. అయితే...అంతర్గత కలహాలతో వీళ్ల మధ్య దూరం పెరిగింది. అగ్రవర్ణమైన రాజ్‌పూత్ వర్గానికి చెందిన ఆనంద్ మోహన్‌కి లాలూ ప్రసాద్ మధ్య విభేదాలు వచ్చాయి. 1993లో ఆనంద్ మోహన్ జనతా దళ్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. అదే బిహార్ పీపుల్స్ పార్టీ (BPP). అప్పటి నుంచి అగ్రెసివ్‌గా మారిపోయారు. ఆయన ర్యాలీ పెడితే చాలు వేలాది మంది ప్రజలు తరలి వచ్చే వాళ్లు. రెండేళ్ల తరవాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్...షియోహర్‌ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరవాత NDAతో చేతులు కలిపారు. మళ్లీ NDAను వీడి UPAతో జట్టు కట్టారు. 


కృష్ణయ్య హత్య కేసు..


1994లో BPP పార్టీకి చెందిన చోటన్ శుక్లా హత్యకు గురయ్యాడు. ఆయన డెడ్‌బాడీని పట్టుకుని BPP నేతలంతా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కొంత మంది పోలీసులు కావాలనే అతడిని ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు ఆనంద్ మోహన్. ఒక్కసారిగా రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు మొదలయ్యాయి. పోలీసుల వాహనాలు ధ్వంసం చేశారు. మరుసటి రోజు ముజఫర్‌పూర్‌లో లాల్‌గంజ్ వద్ద నిరసనలు చేశారు. అక్కడే ఆనంద్ మోహన్ స్పీచ్ ఇచ్చారు. అదే సమయంలో గోపాల్‌గంజ్ నుంచి హాజీపూర్‌కి వస్తున్నారు గోపాల్‌గంజ్‌ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జి కృష్ణయ్య. ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి. మహబూబ్‌నగర్ ఆయన సొంతూరు. సరిగ్గా ఆందోళనలు జరిగే సమయంలో ఆయన కార్‌ అటువైపు వచ్చింది. వెంటనే ఆందోళనకారులంతా ఆ కార్‌పై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. కాసేపట్లోనే అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కృష్ణయ్యకు అప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ మూక దాడిలో ఆనంద్ మోహన్‌ హస్తం ఉందన్న ఆరోపణలొచ్చాయి. 2007లో దిగువ కోర్టు ఆనంద్‌కు మరణ శిక్ష విధించింది. ఆ తరవా పట్నా హైకోర్టు ఆ తీర్పుని సవరించి జీవిత ఖైదు వేసింది. కానీ...ఇప్పుడు శిక్ష పూర్తిగా అనుభవించకుండానే బయటకు రావడం వివాదాస్పదమవుతోంది. 


Also Read: ఉరికంబం ఎక్కే ముందు రుచికరమైన విందు, సొంత డబ్బుతో తోటి ఖైదీలకూ ఫుడ్ ఆర్డర్