Indian Hanged in Singapore:
సింగపూర్‌లో ఉరి
సింగపూర్‌లో భారత్‌కు చెందిన తంగరాజు సుప్పయ్యను ఉరి తీసింది అక్కడి ప్రభుత్వం. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఉరి శిక్ష విధించింది. ఎన్ని సార్లు పిటిషన్లు పెట్టుకున్నా వాటిని పట్టించుకోలేదు. డ్రగ్స్ సరఫరాను తీవ్రమైన నేరంగా పరిగణించి మరణ శిక్ష వేసింది. సాధారణంగా ఉరి తీసే ముందు చివరి కోరికేంటో చెప్పాలని అడుగుతారు. తంగరాజుని కూడా జైలు అధికారులు అదే అడిగారు. తన ఫేవరెట్ ఫుడ్ తినాలనుందని చెప్పాడు. జైలు అధికారులతో పెద్ద లిస్ట్ ఇచ్చాడు. చికెన్ రైస్, బిర్యాని, ఐస్‌క్రీమ్ సోడా, స్వీట్‌లు..ఇలా చాలానే అడిగాడు. సింగపూర్‌కి చెందిన ఓ యాక్టివిస్ట్ ఇందుకు సంబంధించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఉరి తీసే ముందు ఏం జరిగిందో ఆ పోస్ట్‌లో వివరించారు. అంతకు ముందు చాలా వారాల పాటు పస్తులున్నాడు తంగరాజు. బరువు తగ్గేందుకు డైట్ ఫాలో అయ్యాడు.
యాక్టివిస్ట్ పోస్ట్..
"ఇక ఎలాగో చనిపోతున్నా కదా..ఈ రోజైనా రుచికరమైన విందు తిందాం" అనుకున్నాడో ఏమో ఇష్టమైనవన్నీ తెప్పించుకుని తిన్నాడు. దాదాపు అన్ని రకాల వంటలు తెప్పించిన జైలు అధికారులు స్వీట్‌లు మాత్రం ఇవ్వలేదు. ఉరి తీసే ముందు ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోవచ్చు అంటూ జైలు అధికారులు తంగరాజుకి కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో ఫిష్ బర్గర్‌లు, కర్రీ పఫ్‌లు, కూల్ డ్రింక్‌లు కొనుక్కున్నాడు. అంతే కాదు. తనతో పాటు శిక్ష అనుభవిస్తున్న వారందరికీ అవే తెప్పించాడు. అందరూ కడుపు నిండా తిన్నాక హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చుట్టూ ఉన్న వారిలో ఎవరికీ ఏ ఐటమ్ మిస్ అవ్వకుండా అందరికీ ఆర్డర్ చేశాడు. ఆ తరవాత ఆనందంగా ఉరికంబం ఎక్కాడు. యాక్టివిస్ట్ పోస్ట్ చదివిన వాళ్లు తంగరాజు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.
యాంటీ డ్రగ్స్ చట్టం..
భారత్ మూలాలాన్న తంగరాజు సుప్పియ (46) డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతడి నుంచి దాదాపు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌లోని చంగీ జైల్లో పెట్టిన అధికారులు...ఆ తరవాత ఉరి తీశారు. ఈ మేరకు సింగపూర్ ప్రిజన్ సర్వీస్ అధికారిక ప్రకటన చేసింది. అతడిని క్షమించి వదిలేయాని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడు తంగరాజు కోర్టులో రివ్యూ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ దాన్ని కొట్టేశారు. రివ్యూ చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలను తంగరాజు కోర్టుకి ఇవ్వలేకపోయాడని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఉరి శిక్ష విధించాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు అధికారులు. ఈ విషయంలో ఎలాంటి పక్షపాతమూ లేదని స్పష్టం చేశారు. సింగపూర్‌లో యాంటీ డ్రగ్స్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి శిక్షలు పడాల్సిందేనని తేల్చి చెబుతోంది. 2018 అక్టోబర్‌లోనే ఈ కేసులో తంగరాజుని దోషిగా తేల్చింది కోర్టు. అప్పటి నుంచి రివ్యూ పిటిషన్‌లు పెట్టుకున్నప్పటికీ దేన్నీ కోర్టు పట్టించుకోలేదు. సరైన ఆధారాలు లేవని ఆ పిటిషన్‌లను కొట్టి వేసింది. 2019 ఆగస్టులో అప్లై చేసినా లాభం లేకుండా పోయింది.
Also Read: Bengaluru Techie: థియేటర్‌లో సినిమా చూస్తూనే ఆఫీస్ వర్క్, వీర లెవల్ డెడికేషన్ ఇది - వైరల్ వీడియో