DOMS IPO: భారతీయ స్టేషనరీ కంపెనీ డూమ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Doms Industries Pvt Ltd) పేరు త్వరలోనే పబ్లిక్ లిమిటెడ్‌గా మారే అవకాశం ఉంది. అంటే, డూమ్స్ షేర్లను స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసే అవకాశం రాబోతోంది.
ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ప్రారంభించడానికి ఈ కంపెనీ యోచిస్తున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. ఇందుకోసం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి (Securities and Exchange Board of India) ఈ ఏడాది జూన్‌లోగా డ్రాఫ్ట్ పేపర్ ఫైల్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
రూ.2,453 కోట్లు సమీకరించే లక్ష్యం
IPO ద్వారా, ప్రైమరీ మార్కెట్ నుంచి 200 మిలియన్ డాలర్ల నుంచి 300 మిలియన్ డాలర్ల వరకు (దాదాపు రూ. 2,453 కోట్లు) సమీకరించాలని డూమ్స్ పెన్సిల్ కంపెనీ భావిస్తోంది.
మిలాన్‌కు చెందిన ఫ్యాబ్రికా ఇటాలియానా లాపిస్ ఎడ్ అఫిని స్పా (Fabbrica Italiana Lapis ed Affini SpA లేదా Fila) యాజమాన్యంలో డూమ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పని చేస్తోంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా వాటా విక్రయంపై ఈ కంపెనీ ప్రస్తుతం సలహాలు తీసుకుంటోందని, ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. అతి త్వరలోనే IPO డ్రాఫ్ట్ పేపర్‌ను సెబీకి సమర్పించడం, త్వరగా అనుమతులు తెచ్చుకుని అంతే త్వరగా షేర్లను లిస్ట్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇది అఫీషియల్ స్టేట్‌మెంట్ కాదు కాబట్టి, తమ పేర్లు బయటకు చెప్పొద్దని వాళ్లు కోరారు. చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి పబ్లిక్ ఆఫర్ సైజ్, టైమ్ లైన్ సహా IPO వివరాలు మారే అవకాశం ఉందని తెలిపారు.
R.R.ఇండస్ట్రీస్‌లో డూమ్స్ మూలాలు
RR గ్రూప్ ప్రధాన సంస్థ, పెన్సిల్ తయారీ కంపెనీ R.R.ఇండస్ట్రీస్‌తో డూమ్స్ మూలాలు ముడిపడి ఉన్నాయి. RR గ్రూప్, 2006లో స్టేషనరీ బ్రాండ్ డూమ్స్‌ను ప్రారంభించింది. ఉంబర్‌గావ్‌లో తన ఉత్పత్తి కార్యకలాపాలు అన్నింటినీ కలిపేసి దాని పేరును డూమ్స్‌గా పేరు మార్చింది. ప్రస్తుతం, డూమ్స్ పెన్సిల్ కంపెనీకి భారతదేశంలో 15కు పైగా ఉత్పత్తి ఫ్లాంట్‌లు ఉన్నాయి. వాటిలో పెన్సిళ్లు, ఎరేజర్‌లు, రూలర్‌లు ఉత్పత్తి చేస్తోంది. డూమ్స్ ఉత్పత్తులు 50కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
జియోట్టో కలరింగ్ పెన్సిళ్లు, కాన్సన్ పేపర్లు తయారు చేసే ఇటాలియన్ సంస్థ ఫిలా (Fila), 2012లో డూమ్స్‌లో 18.5% వాటాను 5.4 మిలియన్ పౌండ్లు లేదా 5.9 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మూడు సంవత్సరాల తర్వాత, తన వాటాను 51%కి పెంచుకుంది. దీని ద్వారా, డూమ్స్‌లో అతి పెద్ద వాటాదారుగా అవతరించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.