Ebixcash IPO News: అమెరికన్‌ నాస్‌డాక్‌ (Nasdaq) లిస్టెడ్ కంపెనీ 'ఎబిక్స్ ఇంక్‌'కు (Ebix Inc) భారతీయ అనుబంధ సంస్థ 'ఎబిక్స్‌క్యాష్‌ లిమిటెడ్‌' (Ebixcash Ltd‌). ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను ప్రారంభించడానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఈ కంపెనీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. 


SEBIకి దాఖలు చేసిన డ్రాఫ్ట్ పేపర్ ప్రకారం, IPO ద్వారా ప్రైమరీ మార్కెట్ నుంచి 6000 కోట్ల రూపాయలను ఎబిక్స్‌క్యాష్‌ సేకరించవచ్చు. ఈ నెల 10వ తేదీన సెబీ అనుమతి జారీ చేసింది.


IPOలో అన్నీ ఫ్రెష్‌ షేర్లే!
డ్రాఫ్ట్ పేపర్ ప్రకారం, ఎబిక్స్‌క్యాష్‌ కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా ఈ పబ్లిక్‌ ఇష్యూ (IPO) నుంచి డబ్బును సేకరిస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ఒక్క షేర్‌ కూడా జారీ చేయడం లేదు. అంటే, కంపెనీకి చెందిన ప్రమోటర్లు గానీ, ప్రస్తుత ఇన్వెస్టర్లు గానీ తమ వాటాలను ఈ ఇష్యూలో విక్రయించడం లేదు. కంపెనీ భవిష్యత్‌ మీద ప్రమోటర్లకు, ప్రస్తుత ఇన్వెస్టర్లు గట్టి నమ్మకం ఉన్న సందర్భాల్లో OFS లేని IPO వస్తుంది. దీనిని ప్లస్‌ పాయింట్‌గా చూడవచ్చు. ఈ కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ‍‌(NSE) లిస్ట్ అవుతాయి.


IPO ద్వారా సేకరించిన డబ్బుతో, కంపెనీ అనుబంధ సంస్థలైన 'ఎబిక్స్‌ ట్రావెల్స్', 'ఎబిక్స్‌క్యాష్‌ వరల్డ్ మనీ' వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు నిధులు సమకూరుస్తుంది. 


ఎబిక్స్‌క్యాష్‌ వ్యాపారం
ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మోడల్ ద్వారా B2C, B2B, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో డిజిటల్ ఉత్పత్తులు & సేవలకు సాంకేతికతను ఎబిక్స్‌క్యాష్‌ అందిస్తుంది. పేమెంట్ సొల్యూషన్స్, ట్రావెల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, BPO సర్వీసెస్, స్టార్టప్‌ల రంగాల్లో వ్యాపారం చేస్తోంది. 


దిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా సహా దేశంలోని 20 అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఎబిక్స్‌క్యాష్‌ ఫారెక్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం, G-20 సమావేశాలకు హాజరు కావడానికి భారతదేశానికి వచ్చే విదేశీ పౌరులకు UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీ సౌకర్యాన్ని కంపెనీ అందజేస్తామని EbixCash ప్రకటించింది.


ఎబిక్స్‌క్యాష్‌, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 4152.5 కోట్ల ఆదాయం మీద రూ. 230 కోట్ల లాభాన్ని సంపాదించింది. 


సర్వైవల్ టెక్నాలజీస్ ఐపీవోకి (Survival Technologies IPO) కూడా ఈ నెల 10వ తేదీన సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఫ్రెష్‌ షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 200 కోట్లు, 'ఆఫర్ ఫర్ సేల్' కింద షేర్లను విక్రయించడం ద్వారా రూ. 800 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తంలో రూ. 175 కోట్లను కార్పొరేట్ అవసరాల కోసం వెచ్చించనున్నారు. ప్రత్యేక రసాయనాల తయారీ వ్యాపారాన్ని ఈ కంపెనీ చేస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.