Upcoming IPOs News: గత కొన్ని నెలల నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ కొద్దికొద్దిగా కుదుటపడే సూచనలు కనిపిస్తుండడంతో, చాలా కంపెనీలు మళ్లీ 'ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్'ల మీద దృష్టి పెట్టాయి. కొన్ని కంపెనీలు IPO అనుమతి కోసం మార్కెట్ రెగ్యులేటర్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా'ను (SEBI) ఆశ్రయిస్తుండగా, మరికొన్ని కంపెనీలు అనుమతులు దక్కించుకుంటున్నాయి.
ఇదే కోవలో, రెండు కంపెనీల IPOలకు సెబీ ఆమోదం తెలిపింది. అవి.. ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్ (Ebixcash Ltd), సర్వైవల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (Survival Technologies Ltd). ఈ రెండు కంపెనీలు కలిసి ప్రైమరీ మార్కెట్ నుంచి మొత్తం రూ. 7,000 కోట్లను సమీకరించబోతున్నాయి. ఈ మొత్తంలో సింహభాగం వాటా ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్‌ది.
ఈ రెండు కంపెనీలు, తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం గత ఏడాది మార్చిలో, డిసెంబర్‌లో SEBIకి సంబంధిత పత్రాలు సమర్పించాయి. ఈ రెండు కంపెనీలు IPOను ప్రారంభించడానికి సెబీ ఈ నెల 10వ తేదీన అనుమతి జారీ చేసింది.
ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్ IPO
SEBIకి సమర్పించిన DRHP (Draft Red Herring Prospectus) ప్రకారం... ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్ అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్‌డాక్‌లో (Nasdeq) లిస్ట్ అయింది. IPO ద్వారా 6000 కోట్ల రూపాయలను సమీకరించడానికి ప్రయత్నిస్తోంది. ఈ IPOలో, కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా షేర్లను విక్రయించదు. తాజా షేర్ల ద్వారా మాత్రమే డబ్బు సమీకరిస్తుంది. అంటే, ఈ కంపెనీ ప్రమోటర్లు గానీ, ఇప్పటికే ఉన్న షేర్‌హోల్డర్లు గానీ ఒక్క షేర్ కూడా అమ్మడానికి ఇష్టపడడం లేదు. ఈ ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తం నగదుతో కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చుకుంటుంది. దీంతో పాటు, సాధారణ అవసరాలు, కార్పొరేట్ లక్ష్యాల కోసం వినియోగిస్తుంది.
సర్వైవల్ టెక్నాలజీస్ IPO
సర్వైవల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సెబీకి సమర్పించిన ఐపీవో పత్రాల ప్రకారం... ఐపీఓ ద్వారా మొత్తం రూ. 200 కోట్ల విలువైన తాజా షేర్లు జారీ కానున్నాయి. ఇది కాకుండా, కంపెనీ ప్రమోటర్ 'ఆఫర్ ఫర్ సేల్' ద్వారా రూ. 800 కోట్ల విలువైన షేర్లను జారీ చేస్తారు. ఈ డబ్బుతో కంపెనీ తన వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చుకుంటుంది.
ఈ రెండు కంపెనీల షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) లిస్ట్ అవుతాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.