R Venkataramani: భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణి నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు. ఆయన నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్‌ అఫైర్స్‌ విభాగం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.


మూడేళ్ల కాలానికి ఆయనను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. వెంకటరమణి అక్టోబర్‌ 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.


ప్రొఫైల్



  1. వెంకటరమణికి న్యాయవాదిగా సుప్రీం కోర్టులో 42 ఏళ్ల ప్రాక్టీసు ఉంది.

  2. ఆయన 1977, జులైలో తమిళనాడు బార్ కౌన్సిల్‌లో చేరారు.

  3. 1979లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పీపీ రావు ఛాంబర్‌లో చేరారు.

  4. అనంతరం 1982లో సుప్రీం కోర్టులో సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.

  5. 1997లో సర్వోన్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయవాది అయ్యారు. 

  6. ఆ తర్వాత 2010లో లా కమిషన్ సభ్యునిగా తొలిసారి నియమితులయ్యారు.

  7. 2013లో మరోసారి లా కమిషన్ సభ్యునిగా ఆయన్ను పొడిగించారు. 


వెంకటరమణి ప్రముఖంగా రాజ్యాంగం, పరోక్ష పన్నుల చట్టం, మానవ హక్కుల చట్టం, పౌర, క్రిమినల్ చట్టం, వినియోగదారుల చట్టం, అలాగే సేవలకు సంబంధించిన చట్టంలోని వివిధ శాఖలలో ప్రాక్టీస్ చేశారు.


కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నత న్యాయస్థానం, హైకోర్టులలో వారి ప్రధాన కేసుల్లో వాదనలు వినిపించారు. 


2001లో జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్టులు సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడేందుకు వెంకటరమణని ఆహ్వానించారు. అంతర్జాతీయంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై ఒడంబడికలు (ICESCR), 1966కు సంబంధించి ఐచ్ఛిక ప్రోటోకాల్‌పై మానవ హక్కుల కమిషన్‌కు నివేదికను సమర్పించేందుకు ఈ వర్క్‌షాప్‌ను రూపొందించారు.


నో చెప్పిన రోహత్గి


కేకే వేణుగోపాల్‌ స్థానంలో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గిని నియమించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే సొంత కారణాలతో రోహత్గి ఆ ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించారు.


రోహత్గి 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. రోహత్గి 2017లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడంతో 15వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ను నాడు ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత కేకే వేణుగోపాల్‌ పదవీకాలాన్ని పొడిగించారు. అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. ఆయన ఈ పదవిలో దాదాపు 5 ఏళ్లుగా కొనసాగుతున్నారు.


కేంద్రం విజ్ఞప్తితో


2020లోనే వేణుగోపాల్‌ మూడేళ్ల పదవీకాలం ముగిసింది. అప్పటికే ఆయన వయస్సు దాదాపు 89 ఏళ్లు. తన వయస్సును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతిని ఇవ్వాలని అప్పట్లో వేణుగోపాల్‌ కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం ఆయన్ను మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగమని అభ్యర్థించడంతో ఆయన కొనసాగారు.


Also Read: Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?


Also Read: R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్‌ వెంకటరమణి