Britain Next PM:


 సమస్యలు తీర్చేస్తాను: రిషి 


బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ముగిసినట్టే ముగిసి మళ్లీ మొదటికే వచ్చింది. లిజ్ ట్రస్‌ రాజీనామాతో మరోసారి ప్రధాని ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ సారి భారత సంతతికి చెందిన రిషి సునాక్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మధ్య పోటీ నెలకొంది. అయితే...గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన రిషి సునాక్‌...ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే...తన హామీల చిట్టాని విప్పారు. యూకే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని, పార్టీలోనూ ఐక్యత సాధించేలా చొరవ చూపుతానని వెల్లడించారు. దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నందునే..ప్రధాని రేసులో ఉన్నానని చెప్పారు. ట్విటర్‌లో ఓ సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు. "యూకే చాలా గొప్ప దేశం. కానీ...మనం ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాన్ని బట్టే మన దేశ భవితవ్యం ఆధార పడి ఉంటుంది. అందుకే..ఈ ప్రధాని రేసులోకి వచ్చాను. మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టాలన్నదే నా ఆకాంక్ష" అని ఆ నోట్‌లో రాశారు. "ఛాన్సలర్‌గా ప్రజలకు సేవలందించాను. కష్టకాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోటానికి సహకరించాను. ఇప్పుడు మనం
ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా పెద్దవని తెలుసు. కానీ..సరైన నిర్ణయాలు తీసుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి" అని వెల్లడించారు. 






ట్రాక్ రికార్డ్..


"నా ట్రాక్ రికార్డ్‌ చూడండి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు నా దగ్గర ఓ పక్కా ప్రణాళిక ఉంది. నా నేతృత్వంలో నడిచే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది. అన్ని స్థాయుల్లోనూ సరైన సమయానికి పనులు పూర్తయ్యేందుకు పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతుంది. నా రికార్డ్‌పై నాకు చాలా నమ్మకం ఉంది. సమస్యలు పరిష్కరించేందుకు ఒక్క అవకాశం ఇవ్వమని అడుగు తున్నాను" అని కోరారు రిషి సునాక్. 


రిషి వర్సెస్ జాన్సన్


కన్జర్వేటివ్‌ సభ్యుల్లో దాదాపు 100 మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రధాని రేసులో పోటీ చేయాలంటే కచ్చితంగా 100 మంది సభ్యుల మద్దతు అవసరం. అలా చూస్తే...రిషి సునాక్‌ ఆ అర్హత సాధించినట్టే. 93 మంది సభ్యులు ఆయన వైపు ఉన్నారని మొదట అనుకున్నా...బ్యాలెట్‌ పేపర్‌ పరంగా చూస్తే ఆ సంఖ్య 100 వరకూ చేరినట్టు సమాచారం. లిజ్‌ ట్రస్ కన్నా ముందు బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ కూడా ఇప్పుడు ప్రధాని రేసులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 44 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇన్నాళ్లూ కరేబియాలో ఉన్న ఆయన...ఈ పోటీ నేపథ్యంలో మళ్లీ బ్రిటన్‌కు వచ్చేశారు. అంటే...ఈ సారి పోటీ సునాక్, జాన్సన్ మధ్య ఉండనుంది. ఇద్దరూ అధికారికంగా ఇంకా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించలేదు. అటు పెన్నీ మొర్డాంట్‌ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. 21 మంది సభ్యుల సపోర్ట్‌తో ఆమె ఈ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. 


Also Read: ఔను, ‘సర్దార్’ చెప్పింది నిజమే - ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగితే ప్రాణాలు పోతాయ్, ఇదిగో ఇలా..