మునుగోడు ఉప ఎన్నికల వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేస్తారోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కుట్రల కామెంట్లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నట్లుగా వైరల్ అయిన ఆడియో విషయంలో పార్టీ క్రమ శిక్షణా చర్యలలో భాగంగా ఎంపీకి పోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోరాదో 10 రోజులలో సమాధానం చెప్పాలని వెంకట్ రెడ్డికి గడువు ఇచ్చారు.
కాంగ్రెస్ నేత జబ్బర్ భాయ్ కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి.. తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని ఆయన కోరినట్లు ఆడియో వైరల్ కావడం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలపడానికి బదులుగా బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి సహకారం అందిస్తున్నారని అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో వైరల్ అయినట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఈ విషయంపై పార్టీ డిసిప్లీనరీ యాక్షన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ డిసిప్లీనరీ యాక్షన్ కమిటీ కార్యదర్శి ఎంపీ వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇది క్రమశిక్షణా ఉల్లంఘన చర్య అని, మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.
Komatireddy Audio Leak : మునుగోడు ఉపఎన్నికలో ఆడియో లీక్ ల కలకలం రేపుతున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ బీజేపీ నేతకు ఫోన్ చేసి సహకరించాలని కోరినట్లు ఓ ఆడియో వైరల్ అయింది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాయిస్ అంటూ ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పార్టీలకతీతంగా తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ ఆడియోలో కోరారు. వెంకటర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తున్నారు. అయితే తమ్ముడికి సపోర్టుగా వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో తాజాగా వైరల్ అవుతోంది.
ఆడియోలో ఉన్నది ఇదే
"రేపు ఏం జరిగినా రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తాడు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. నేను పీసీసీ ప్రెసిడెంట్ అవుతాను. అన్నీ నేను చూసుకుంటా. ఈసారి పార్టీలకతీతంగా సాయం చేయండి. ఈ దెబ్బకు నేను పీసీసీ ప్రెసిడెంట్ అవుతా. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తాను. మనిషిని చూసి చేస్తున్నాం పార్టీ కాదు. ఈ ఒక్కసారికి పార్టీలు చూడకండి. నేను వచ్చి కలుస్తాను." అని ఆడియోలో వాయిస్ ఉంది.
కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ గుబులు !
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సమయంలో ఇక్కడ ఉండకుండా ఆయన ప్లాన్ చేసుకున్నారని పార్టీలోనూ ప్రచారం జరుగుతోంది. అయితే మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేనే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అక్కడ ఉండి మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా ఉపయోగం లేదన్నారు. ప్రచారం చేసినా వస్తే 10 వేల ఓట్ల వరకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోతుందని తెలిసి, ప్రచారం చేయడంలో అర్థం లేదని వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియాలో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.