Rahul Gandhi Bharat Jodo Yatra in Telangana: భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదని, దేశ సమైక్యత కోసమే ఈ యాత్ర చేస్తున్నానని ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని విచిన్నం చేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. నేటి ఉదయం తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. కృష్ణా మండలం కృష్ణా బ్రిడ్జి పై తెలంగాణ లోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ జెండాను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అప్పగించారు.
తెలంగాణలో తొలిరోజు ముగిసిన రాహుల్ పాదయాత్ర
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్టాల్లో రాహుల్ పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఏపీలోనూ రెండు రోజుల కిందట జోడో యాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ మరోసారి షెడ్యూల్ లో భాగంగా కర్ణాటకలోని రాయచూర్ లో యాత్ర కొనసాగించారు. నేటి ఉదయం రాహుల్ గాంధీ తెలంగాణలో తన యాత్రను మొదలుపెట్టారు. అయితే రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టిన కొన్ని గంటలకే తెలంగాణలో తొలిరోజు భారత్ జోడో యాత్ర ముగించారు రాహుల్. దీపావళి పండుగ సందర్భంగా పాదయాత్రకు 3 రోజులు బ్రేక్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ 27న ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతా అన్నారు.






తెలంగాణలో తొలి రోజు జోడో పాద యాత్ర ముగించుకున్న రాహుల్ గాంధీ గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు రాహుల్ గాంధీ. ‘రాసి పెట్టుకో... రాజ్యమా గుర్తు పెట్టుకో... హిమాలయ శిఖరం... మా నాయకత్వం.  జై బోలో – భారత్ జోడో. మహానేతకు మన తెలంగాణ తరఫున స్వాగతం’ అంటూ రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 


తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న రాహుల్ పాదయాత్ర, ఆపై 12 రోజులపాటు ప్రజలతో ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు.