Fire Broke Out at Cracker Stall in Vijayawada: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గాంధీనగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో దీపావళికి ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్ లో మంటలు చెలరేగాయి. టపాసుల స్టాల్స్ లో క్రాకర్స్ భారీ శబ్ధంతో పేలిపోతున్నాయి. దీంతో కొన్ని స్టాల్స్ అగ్నికి కాలిపోతున్నాయి. దుకాణదారులు, స్థానికులు ప్రాణ భయంతో గ్రౌండ్ బయటకు పరుగులు తీశారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారని సమాచారం. మరికొందరు స్థానికుల సహాయంతో దుకాణాదారులు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు జింఖానా గ్రౌండ్ కు వెళ్లి పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్టాల్స్ షాపుల వారికి లక్షల రూపాయల నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ప్రతి ఏడాది దీపావళి పండుగ సందర్భంగా విజయవాడలోనూ పటాసుల స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం గాంధీ నగర్ లోని జింఖానా మైదానంలో నిర్వాహకులు దీపావళి టపాసుల స్టాల్స్‌ ఏర్పాటు చేసి విక్రయాలు కొనసాగిస్తున్నారు. నేడు ఆదివారం, సెలవు దినం కావడంతో కొనుగోలుదారులు క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు జింఖానా గ్రౌండ్ కు తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో పటాసు పేలింది. దాంతో దీపావళి క్రాకర్స్ స్టాల్స్ లో ఓచోట మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు పక్కనున్న స్టాల్స్ కు వ్యాపించాయి. పటాసులు భారీ శబ్ధంతో పేలుతుండటంతో దుకాణదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు దుకాణదారులు స్థానికుల సహాయంతో మంటలపై నీళ్లు చల్లుతూ అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి. మొత్తం 19 షాపులకు అనుమతి ఉండగా, ఇందులో మూడు షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. 15, 16, 17 షాపుల్లో చెలరేగిన మంటలు చెలరేగి లక్షల్లో నష్టం వాటిల్లింది. మృతులు 15వ షాపుకు చెందినవారుగా భావిస్తున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక వ్యాపారికి గుండె పోటు రావటంతో ఆసుపత్రికి తరలించారు.






పండుగ పూట విషాదం..
దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ క్రాకర్ స్టాల్ లో పటాసు పేలడంతో అది భారీ అగ్ని ప్రమాదంగా మారింది. ఈ ప్రమాదంలో మూడుకు పైగా దీపావళి క్రాకర్స్ స్టాల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిని పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది ఎంతగానో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.