Telugu breaking News: ఈనెల 24న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ తొలి సమావేశం

Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

Sheershika Last Updated: 19 Jun 2024 12:23 PM
Breaking News: ఈనెల 24న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ తొలి సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన మంత్రిమండలి 24న తొలిసారి సమావేశం కానుంది. ఇప్పటికే తొలి సంతకాలు చేసిన ఫైల్స్‌ను ఆమోదించనున్నారు. ఈసారి మంత్రిమండలిలో చాలామంది కొత్తవాళ్లు ఉన్నందున వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రమాణం చేసిన మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా 21న ప్రారంభంకానున్నాయి. అక్కడ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన సచివాలయంలో పదవీ బాధ్యతలు తీసుకున్నారు. 

ఏపీ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి

అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి. ఇప్పుడు కొలువుదీరనున్న అసెంబ్లీలో చంద్రబాబు తర్వాత ఎక్కువసార్లు విజయం సాధించిన జాబితాలో బుచ్చయ్యచౌదరి ఉన్నారు. దీంతో ఆయన్ని ప్రొటెంస్పీకర్‌గా చేయనున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందే ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. సమావేశాలకు ఆయన స్పీకర్‌గా వ్యవహరించి ఎమ్మెల్యేతో ప్రమాణం చేయిస్తారు. అదే రోజు కొత్త స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈసారి కూటమికి భారీ సంఖ్యలో సభ్యులు ఉన్నందున ఆ ఎంపిక లాంఛనం కానుంది. అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని చేయనున్నారని సమాచారం. 

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ నేమ్‌ బోర్డు చూశారా!

ఉపముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా కాసేపట్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్‌కు సంబంధించిన నేమ్‌ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


Background

Latest Telugu Breaking News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖల మంత్రులుగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ క్యాంపు ఆఫీసులో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత 11 గంటలకు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో సమావేశమవుతారు. 12 గంటలకు గ్రూప్ 1 ,2 అధికారులతో భేటీ అవుతారు. 12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో సమీక్ష ఉంటుంది. 


ఎమ్మెల్యే ఎన్నికై, మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వెలగపూడి సచివాలయం వరకు పూల వర్షం కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల ఆంక్షలు దాటుకొని వెళ్లి మరీ రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. అలాంటి ఘటనలు గుర్తు చేసుకున్న రైతులు పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. నినాదాలు చేశారు. మోకాళ్లపై నిల్చొని పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా జనంతో నిండిపోయిన ఆరు కిలోమీటర్లు రహదారి దాటుకొని సచివాలయానికి చేరుకోవడానికి పవన్‌కు గంటకుపైగా సమయం పట్టింది. 


తొలిసారి సచివాలయానికి వచ్చి పవన్ కల్యాణ్‌ ముందుగా తన ఛాంబర్ చూడకుండానే నేరుగా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం కార్యాలయానికి వెళ్లిన పవన్‌ను చంద్రబాబు ఎదురువచ్చి ఆహ్వానించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీళ్లిద్దరు దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఇందులో 45 నిమిషాలు ఏకాంతంగా పలు అంశాలపై చర్చించుకున్నారు. 


పవన్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు, ఆ ప్రాంత ప్రజలు భారీగా చేరుకున్నారు. దీంతో పవన్ కేటాయించిన బ్లాక్ మొత్తం నిండిపోయింది. వాళ్లందరికీ అభివాదం చేస్తూ అడిగిన వారికి సెల్ఫీలు ఇస్తూ పవన్ కల్యాణ్ తన ఛాంబర్‌ను పరిశీలించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.