South Korea News | సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యువాన్ ఎయిర్ పోర్టులో అదుపుతప్పిన విమానం రన్ వే పక్కన ఉన్న గోడను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 179 మంది దుర్మరణం చెందారు. మొదట 28 చనిపోయారని అధికారులు తెలిపారు, ఆపై మృతుల సంఖ్యల 80కి పైగా ఉండొచ్చునని పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేసరికి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ఆ విమానంలో మొత్తం 181 మంది ఉండగా, వారిలో  175 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని యోన్హాప్ మీడియాలో పేర్కొంది. 


బ్యాంకాక్ వచ్చిన విమానం..


థాయ్‌లాండ్ బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7C2216 అనే విమానం మొత్తం 181 మందితో దక్షిణ కొరియాలోని యువాన్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కానీ చివరి నిమిషంలో సమస్య రావడంతో విమానం రన్‌వే పక్కనున్న గోడను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి విషాదం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రాణనష్టం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. 


విమాన ప్రమాదం గురించి తెలియగానే వారి కుటంబసభ్యులు పెద్ద ఎత్తున యువాన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తమ వాళ్ల క్షేమ సమాచారం తెలుస్తుందేమోనని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. ప్రమాదంలో దాదాపు అంతా చనిపోగా, కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు. కనీసం తమ కుటుంబసభ్యుల డెడ్ బాడీస్ అయినా వెంటనే అప్పగించాలని ప్రయాణికుల బంధవులు ఎయిర్ పోర్ట్ వద్ద అడిగిన దృశ్యాలు ఎందరినో కలచివేశాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 






ప్రమాదానికి కారణం ఏంటంటే..
జేజు ఎయిర్ లైన్స్ విమానం 7C2216 యువాన్ ఎయిర్‌పోర్టుకు దాదాపుగా చేరుకుంది. విమానంలో ల్యాడింగ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతో అదుపుతప్పి సేఫ్టీ వాల్‌ను విమానం ఢీకొందని అధికారులు తెలిపారుు. ల్యాండింగ్ కు కొన్ని సెకన్ల ముందు ఓ పక్షి విమానాన్ని తాకిందని.. దాని వల్ల సమస్య తలెత్తి తీవ్ర విషాదం చోటుచేసుకున్నట్లు దక్షిణ కొరియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 



విమానం ఇంజిన్‌ను పక్షి ఢీకొనడంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తి ఉండొచ్చునని చీఫ్ ఫైర్ ఆఫీసర్ లీ జియోంగ్‌ హైయూన్‌ తెలిపారు. గతంలో 1997లో దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా 228 మంది దుర్మరణం చెందారు. ఆ తరువాత దేశంలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం ఇదేనని అధికారులు చెబుతున్నారు.


Also Read: Viral Video: ఇంతకంటే ఛాన్స్ ఉంటుందా? - నచ్చిన వస్తువు ఫ్రీగా తీసుకెళ్లొచ్చంటూ బంపరాఫర్, కట్ చేస్తే!