Melbourne Test: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. ఆట ముగిసేసరికి 9 వికెట్లకు 228 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నాథన్ లయన్ (41 బ్యాటింగ్) పదో వికెట్ కు సైంధవుడిలా అడ్డుపడి, ఆసీస్ భారీ ఆధిక్యాన్ని సాధించేలా చూశఆడు.
ఆదుకున్న లబుషేన్..
అంతకుముందు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ను భారత బౌలర్లు వణికించారు. ప్రమాదకర బ్యాటర్లు అయిన శామ్ కొన్ స్టాస్ (8), స్టీవ్ స్మిత్ (13), ట్రావిస్ హెడ్ (1), అలెక్స్ క్యారీ (2)లను త్వరగానే పెవిలియన్ కు పంపారు. అయితే టెయిలెండర్లను త్వరగా ఔట్ చేయడంలో బలహీనతను మరోసారి ప్రదర్శించారు. ఈ బలహీనతతోనే తొలి ఇన్నింగ్స్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న భారత్.. రెండో ఇన్నిం్గస్ లోనూ అదే తప్పును రిపీట్ చేసింది. ఇక, ఆసీస్ జట్టులో వన్ డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (139 బంతుల్లో 70, 3 ఫోర్లు) ఓవైపు ఒంటరిగా నిలిచి జట్టును ఆదుకున్నాడు.
వరుసగా వికెట్లు పడుతున్నా తను ఓ ఎండ్ లో నిలబడి, జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ (90 బంతుల్లో 41, 4 ఫోర్లు) తో కలిసి ఆరో వికెట్ కు 55 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిలిపాడు. ఆ తర్వాత లబుషేన్ వెనుదిరిగినా, కమిన్స్.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి మరికొన్ని పరుగులు జత చేశాడు. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే బ్యాట్ తోనూ తను సత్తా చాటాడు. చివర్లో అతను ఔటైనా.. నాథన్ లయన్.. స్కాట్ బోలాండ్ తో కలిసి పదో వికెట్ కు 55 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో ఆసీస్ 330 పరుగుల లీడ్ మార్కును దాటింది. ఇక భారత బౌలర్లలో బుమ్రాకు నాలుగు , సిరాజ్ కు మూడు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కింది.
చివరి వికెట్ గా నితీశ్..
అద్భుతమైన సెంచరీ తో రాణించిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (189 బంతుల్లో 114, 11 ఫోర్లు, 1 సిక్సర్) చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఈ వికెట్ ను లయన్ తీశాడు. దీంతో భారత్ 119.3 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్ కు మూడేసి వికెట్లు దక్కాయి. దీంతో ఆసీస్ కు కీలకమైన 105 పరుగుల ఆధిక్యం దక్కింది.
మరోవైపు 70 ఏళ్ల చరిత్రలో మెల్ బోర్న్ లో 300 పైబడి టార్గెట్ ను చేజ్ చేసిన రికార్డు లేదు. దీంతో ఆట డ్రా దిశగా సాగుతోంది. సోమవారం ఐదో రోజు ఆసీస్ వీలైనన్ని ఎక్కువగా పరుగులు సాధించి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశముంది. ఒక్కరోజులో ఇంత పెద్ద టార్గెట్ ను చేజే చేసే అవకాశం తక్కువగా ఉన్నందున, చివరి రోజు భారత ఆటగాళ్లు డ్రా కోసమే ప్రయత్నించడం ఖాయమని తెలుస్తోంది.