Bumrah 200 wickets Compleated: భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతను సాధించాడు. అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత టెస్టు పేసర్ గా రికార్డులకెక్కకాడు. కెరీర్లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా.. మెల్ బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. అంతకుముందు శామ్ కొన్ స్టాస్ ను ఔట్ చేసిన బుమ్రా.. హెడ్ ను తన ఖాతాలో వేసుకుని 200 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. దీంతో 200 వికెట్లు పూర్తి చేసుకున్న అత్యంత వేగవంతమైన బౌలర్ గా బుమ్రా రికార్డులకెక్కాడు. రవీంద్ర జడేజా కూడా 44వ టెస్టులో 200 వికెట్ల ఘనత సాధించాడు. అందరికంటే ముందుగా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ 37వ టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు. మొత్తానికి ఈ మైలురాయిని చేరుకున్న 12వ భారత బౌలర్ గా నిలిచాడు.
20 సగటు లోపలే..
ఇక 200 వికెట్లను కేవలం 19.5 సగటుతోనే బుమ్రా తీయడం విశేషం. దీంతో దిగ్గజ పేసర్లు మాల్కం మార్షల్ (20.9), జోయెల్ గార్నర్ (21), కర్ట్ లీ ఆంబ్రోస్ (21) ల సగటు కంటే తక్కువతో ఈ మైలురాయిని దాటడం విశేషం. ఇక 200 వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రాదే తక్కువ సగటు ఉండటం గమనార్హం. ఇక అత్యంత వేగవంతంగా 200 వికెట్లు తీసిన టెస్టు బౌలర్ రికార్డు పాకిస్థాన్ కు చెందిన యాసిర్ షా (33 టెస్టులు) పేరిట ఉంది. ఆ తర్వాత ఆసీస్ కు చెందిన క్లారీ గ్రిమ్మెట్ (36 టెస్టులు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 37 టెస్టుతో అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
బీజీటీలో బుమ్రా ఆధిపత్యం..
ఐదు టెస్టుల బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తాజాగా మిషెల్ మార్ష్ వికెట్ తీసిన బుమ్రా.. 28 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మరోవైపు నాలుగో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. నాలుగో రోజు ఆదివారం 358/9 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (114) చివరి వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ కు 105 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తడబడుతోంది.
డ్రింక్స్ విరామానికి 60 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (70) టాప్ స్కోరర్. బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ప్రస్తుతం ఓవరాల్ గా 266 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.