Bilkis Bano Case: 


ప్రవర్తన ఆధారంగానే విడుదల..


బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటం వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఈ నిర్ణయం దుమారం రేపుతుండగా..ఇప్పుడు మరో విషయం ఇంకాస్త సంక్లిష్టం చేసింది. గుజరాత్ భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. "ఈ కేసులో దోషులైన వారిలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారు. వారెంతో సంస్కారవంతులు. బహుశా వారి ముందు తరం వాళ్లు చేసిన తప్పులకు వీళ్లు శిక్ష అనుభవిస్తున్నారేమో" అని గోద్రా ఎమ్మేల్యే సీకే రౌల్జీ వ్యాఖ్యానించారు. ఆ 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ప్రతిపాదించిన వారిలో ఈ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. "15 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన వీళ్లు అసలు ఆ నేరం చేశారా లేదా అన్నది నాకు తెలియదు. మేం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నాం. వాళ్ల ప్రవర్తనను గమనించి, నిర్ణయం తీసుకోవాలని మాకు సుప్రీం కోర్టు సూచించింది" అని రౌల్జీ పీటీఐతో చెప్పారు. వాళ్లను విడుదల చేసే ముందు జైలర్‌తో మాట్లాడమని అన్నారు. ఆ సమయంలోనే వారి 
సత్ప్రవర్తన గురించి తెలిసిందని వెల్లడించారు. వాళ్లలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, ఎంతో సంస్కారవంతులు అని జైలర్ చెప్పినట్టు రౌల్జీ వివరించారు. "సాధారణంగా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు, ఎలాంటి సంబంధం లేని వాళ్ల పేర్లు కూడా తెరపైకి వస్తాయి. బహుశా వీరి ముందు తరం వాళ్లు చేసిన తప్పుల వల్ల వీరిపై అభియోగాలు వచ్చి ఉండొచ్చు. వాళ్లు నేరం చేశారా లేదా అన్నది తెలియదు కానీ..వాళ్ల ప్రవర్తన ఆధారంగానే విడుదల చేశాం" అని రౌల్జీ స్పష్టం చేశారు. 


గాడ్సేనైనా ఉరి తీశారు..సంతోషం : ఒవైసీ



భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "ఓ నేరం చేసి జైలు నుంచి బయటకు రావడానికి ఓ కులం కారణమైనప్పుడు, ఎలాంటి నేరం చేకుండానే జైలు శిక్ష అనుభవించడానికీ కులమే కారణమవుతుంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం చేసిన వారికి అండగా నిలవడమే భాజపా పాలసీ. అది గుజరాత్‌లోనైనా, కథువాలోనైనా. కులం ఆధారంగా జైలు నుంచి బయటకు వచ్చేందుకు పాస్‌లు ఇస్తోంది. థాంక్ గాడ్...కనీసం గాడ్సేనైనా ఉరి తీశారు" అని సెటైర్లు వేశారు ఒవైసీ. 


సంచలనమైన కేసు..


గుజరాత్ అల్లర్లు-2002 సమయంలో బిల్కిస్ బానోపై  సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యుల ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్‭లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతురితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించు కున్నారు. ఈ ఘటనపై అప్పట్లో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను 2004లో అరెస్ట్ చేశారు. 2008 జనవరి 1న వీరికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్ష పడిన వారిని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన ఖైదీల కింద విడుదల చేశారు. వీరిని విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం వంటి కేసులున్న వారిని విడుదల చేయకూడదన్న నిబంధనలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Also Read: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసుపై స్పందించిన స్మిత సబర్వాల్, పొలిటికల్ టర్న్‌ తీసుకున్న ట్వీట్


Also Read: Amit Shah: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని ఏరేశాం, హోం మంత్రి అమిత్‌షా కామెంట్స్