Amit Shah:
దిల్లీలో కాన్ఫరెన్స్..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నేషనల్ సెక్యూరిటీస్ స్ట్రాటెజీస్ కాన్ఫరెన్స్-2022 సమావేశం దిల్లీలో జరిగింది. ప్రధాని మోదీ దేశ భద్రతా వ్యవస్థను ఎంత బలోపేతం చేస్తున్నారో ఈ మీటింగ్‌లో షా ప్రస్తావించారు. రక్షణను పటిష్ఠం చేసేందుకు చేపట్టిన చర్యలనూ చర్చించారు. అంతర్గత భద్రతలో ఎప్పటి నుంచో వేధిస్తున్న మూడు ముఖ్యమైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నట్టు చెప్పారు. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు...గురువారం ముగిశాయి. సెంట్రల్ ఏజెన్సీల అధిపతులతో పాటు..సీఏపీఎఫ్‌లు, సీపీఓలు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీజీపీ కాన్ఫరెన్స్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు
జరుగుతున్నాయని అమిత్ షా వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లోని డీజీపీలు తమ ఏరియాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. సవాళ్లు ఎదుర్కొనే సమర్థత అందరికీ ఉందని చెప్పారు.
ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో విజయం సాధించాం: అమిత్ షా
జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో విజయం సాధించామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. అంతే కాదు. ఈశాన్య రాష్ట్రాల్లోని యూజీ గ్రూపులను, తీవ్రమైన వామపక్ష భావజాలాన్ని కంట్రోల్ చేయగలిగామని స్పష్టం చేశారు. "ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్త చట్టాలు తీసుకొచ్చాం. రాష్ట్రాలతో సమన్వయం పెరుగుతోంది. భద్రతకు అవసరమైన నిధుల కేటాయింపు కూడా పెరిగింది. వీలైనంత మేర టెక్నాలజీని వినియోగిస్తున్నాం" అని తెలిపారు. "డ్రగ్స్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. దొరికిన వాటిని సీజ్ చేయటం కాదు. పూర్తిగా డ్రగ్ నెట్‌వర్క్ మూలాలను గుర్తించటమే కీలకం" అని వివరించారు. "నేరాలకు సంబంధించిన డేటాబేస్‌ను కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తోంది. సెక్యూరిటీని పటిష్ఠం చేసేందుకు 5G టెక్నాలజీని వినియోగించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి" అని చెప్పారు.
ఆగని దాడులు..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేశామని అమిత్ షా చెబుతున్నా..అక్కడ దాడులు మాత్రం ఆగటం లేదు. కశ్మీరీ పండిట్‌లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. 1990ల్లో కశ్మీర్ నుంచి వలస వెళ్లని పండిట్‌లు అంతా కలిసి కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి (KPSS)ను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలపై ఈ సభ్యులు స్పందించారు. "కశ్మీర్ లోయలోని పండిట్‌లందరినీ వెతికి మరీ చంపేస్తాం అనే సంకేతాన్ని టెర్రరిస్టులు ఇస్తున్నారు" అని ఆందోళన చెందుతున్నారు. "లోయలోని కశ్మీరీ పండిట్‌లు అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరుస దాడులతో టెర్రరిస్ట్‌ల లక్ష్యమేంటో స్పష్టంగా తెలుస్తోంది" అని KPSS ఛైర్మన్ సంజయ్ టిక్కూ అన్నారు. కొందరు గ్రౌండ్ లెవెల్‌లో టెర్రరిస్టుల కోసం పని చేస్తూ కశ్మీరీ పండిట్‌ల హత్యకు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్‌నాథ్ యాత్ర సమయంలోనూ అంతా ప్రశాంతంగానే ఉందని, ముస్లిమేతర..ముఖ్యంగా కశ్మీరీ పండిట్‌లు టార్గెట్‌గా మారారని చెప్పారు. పండిట్‌లకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. "రక్షిస్తాం అనే తీపి కబుర్లు వినటం మానేయండి. ఇప్పటికిప్పుడు కశ్మీర్ లోయను వదిలి వెళ్దాం. మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఇక్కడి నుంచి వెళ్లిపోవటం, లేదా టెర్రిరిస్ట్‌ల చేతిలో దారుణంగా చనిపోవటం" అని చాలా ఘాటుగా స్పందిస్తోంది KPSS.
Also Read: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసుపై స్పందించిన స్మిత సబర్వాల్, పొలిటికల్ టర్న్ తీసుకున్న ట్వీట్