Smita Sabarwal: గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేయటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే మహిళా నేతలు, ప్రముఖులు ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. బాధితురాలు బిల్కిస్ బానో కూడా స్పందించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆమె హక్కుని తుడిచిపెట్టివేశాం: IAS అధికారి స్మిత సబర్వాల్
ఈ క్రమంలోనే ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ కూడా ఈ వివాదంపై ట్విటర్ వేదికగా స్పందించారు. "ఓ మహిళగా, సివిల్ సర్వెంట్‌గా బిల్కిస్ బానో కేసుకి సంబంధించిన వార్తను చదివాక, పూర్తిగా నమ్మకం కోల్పోయాను. స్వతంత్ర దేశంలో ఉన్నాననే నమ్మకం కలగట్లేదు. ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా, స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే ఆమె హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయింది. జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో" అని ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్. బాధితురాలు గుజరాత్ ప్రభుత్వానికి రాసిన లేఖనూ ట్వీట్‌కు జత చేశారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, తన కుటుంబ భద్రతకు భరోసా ఇవ్వాలని అందులో బాధితురాలు పేర్కొన్నారు. అయితే స్మిత సబర్వాల్ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నట్టుండి ఈ ట్వీట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తెలంగాణలో జరిగిన అత్యాచారాలపై స్పందించకుండా, ఎక్కడో గుజరాత్‌లోని ఘటనపై ఇంత ఘాటుగా స్పందించడమేంటి అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆమె ట్వీట్‌పై తెలంగాణ భాజపా నేత శ్రావణ్ దాసోజు స్పందించారు. "జూబ్లీహిల్స్, సిరిసిల్ల అత్యాచార కేసుల్లోని దోషులకూ బెయిల్ రావటంపైనా ఆమె విశ్వాసం కోల్పోలేదా? కావాలనే కొన్ని ఘటనలపై మాత్రమేస్పందించటం సరికాదు. IAS అధికారిగా ఉండి ఇలా వ్యవహరించకూడదు" అని తప్పుబట్టారు.
మా నోరు నొక్కేయాలని చూడకండి: స్మిత
అయితే ఐఏఎస్ అధికారుల భావ ప్రకటనా స్వేచ్ఛపైనా ఈ సందర్భంగా చర్చ జరిగింది. దీనిపైనా స్మితా సబర్వాల్ స్పందించారు. "మా నోరు నొక్కేయాలని చూడటానికి ఇది సరైన సందర్భం కాదు. సివిల్ సర్వెంట్‌గా సర్వీస్‌లో భాగంగా దేశం కోసం ఎన్నో ఏళ్లు సేవలందిస్తాం. అలాంటప్పుడు మాపై ఈ ఆంక్షలెందుకు..?" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ప్రభుత్వాధికారుల "ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్"కు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. "Freedom of Expression to Government Employees" అనే టైటిల్‌తో ఉన్న ఆర్టికల్ స్క్రీన్‌షాట్స్‌ని షేర్ చేశారు.
Also Read: BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్‌పై ధీమాగా కమలనాథులు
Also Read: Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?