ఢిల్లీలో పరిస్థితి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంలోని బీజేపీ అనేలా కనిపిస్తోంది. ఇటీవల ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లే జరుగుతోంది. ఇటీవల ఓ మంత్రిని అరెస్ట్ చేశారు. మా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. తాజాగా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. నేటి ఉదయం సీబీఐ అధికారులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కొందరు సీబీఐ అధికారులు ఆప్ నేత సిసోడియా ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. 


మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు.. 
ఢిల్లీలో విద్య, ఆరోగ్యం శాఖలలో అద్భుతమైన పనిని చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారు. కానీ వాటిని ఆపేందుకు సీబీఐ అడ్డుకుంటోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. నేటి ఉదయం సీబీఐ అధికారులు కొందరు తన ఇంట్లో తనిఖీలు చేసేందుకు వచ్చారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మా ఇంటికి సీబీఐ వచ్చింది. మేం చాలా నిజాయితీపరులం. లక్షల మంది చిన్నారుల భవిష్యత్ కోసం మేం ప్రణాళికలు తయారుచేస్తున్నాం. కానీ మంచి పనులను మెచ్చుకునే పరిస్థితులు కనిపించడం లేదు. మన దేశం అందుకే ఇప్పటికీ ప్రపంచంలో నెంబర్ వన్ కాలేదు అని’ మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.






21 ఏరియాల్లో సీబీఐ తనిఖీలు
ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ అప్రమత్తమైంది. మనీష్ సిసోడియా నివాసం సహా ఢిల్లీ , దేశ రాజధాని ప్రాంతంలో 21 చోట్ల సీబీఐ అధికారులు శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తూ విపక్ష పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోందంటూ ఆప్ నేతలు ఆరోపించారు. 


ముందే గుర్తించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 
ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021-22 ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సిఫార్సు చేశారు. ఈ మేరకు సీబీఐ ఎప్పుడైనా విచారణ చేపట్టే అవకాశం ఉంది. దాంతో  సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్‌ విభాగానికి మనీష్ సిసోడియా నేతృత్వం వహిస్తున్నారు. సిసోడియాకు వ్యతిరేకంగా సీబీఐ ఓ కేసు నమోదు చేసిందని కేజ్రీవాల్ అన్నారు.  కొద్ది రోజుల్లో ఆయనను అరెస్టు చేయబోతున్నారని తెలిసిందన్నారు. సిసోడియా తనకు 22 ఏళ్ల నుండి తెలుసునని, నిజాయితీకి నిలువెత్తు నిదర్శమని అన్నారు.