Railway New Coaches : ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను గమనిస్తే ఒక మార్పును చూసే ఉంటారు . రైలు బోగీలు కొత్తరకంగా కనిపిస్తున్నాయి. కరోనాకు ముందు కనిపించే రైలు బోగీల స్థానంలో ఎరుపు -సిమెంట్ రంగుల కలయికలో తళతళలాడే బోగీలు కనిపిస్తున్నాయి. అలాగే హమ్ సఫర్ ,రాజధాని ,శతాబ్ది లాంటి రైళ్లకి అయితే వేరే రంగుల్లో అట్రాక్టివ్ గా కనబడే బోగీలు ఉంటున్నాయి. అయితే ఈ మార్పు వెనుక పెద్ద రీజనే ఉంది. నిన్నమొన్నటి వరకూ మనం ఎక్కే ఇనుప బోగీలను ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ బోగీలు అని పిలిచేవారు. వీటిని భారతీయ రైళ్లలో 1955 లో ప్రవేశ పెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన ఆ బోగీలనే రంగులు మార్చి, కొత్త డిజైన్ లు 2018 వరకూ వాడేవారు. వాటి మాగ్జిమమ్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు మాత్రమే. అయితే భారతీయ రైల్వే ట్రాక్ ల దృష్ట్యా ఎంత గొప్ప ఎక్స్ ప్రెస్ అయినా 80 -90 కిలోమీటర్ల స్పీడ్ లోనే నడిచేవి. అందుకే అనుకున్న టైం కు ట్రైన్ రాదంటూ "రైలు రాకడ -ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు అంటూ " వెటకారపు సామెతలూ పుట్టుకొచ్చాయి. ఈ రకం బోగీలను మనదేశానికి చెందిన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అలాగే స్విట్జ్ ర్లాండ్ కు చెందిన స్విస్ కార్ అండ్ ఎలివేటర్ కంపెనీలు కలిసి డిజైన్ చేశాయి. ఏవో కొన్ని స్పెషల్ ట్రైన్స్ లో తప్ప ఈ రకం రైలు బోగీలు ఏ మాత్రం ఎట్రాక్టివ్ గా ఉండేవి కావు. అలాగే సౌకర్యాలూ తక్కువే. ఇక ప్యాసింజర్ రకం రైళ్ల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ముక్కు మూసుకుని ప్రయాణించే వారి సంఖ్య కోకొల్లలు.
రైళ్ల వేగం పెంచడంపై దృష్టి పెట్టిన అధికారులు
అయితే మారుతున్న భారతీయ పరిస్థితులను బట్టి రైళ్ల వేగం పెంచాలని 1993 నుంచి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకుని.. ఆ స్పీడ్ తట్టుకోవాలంటే అప్పటికే చలామణీ లో ఉన్న ICF కోచ్ ల స్థానంలో LHB కోచ్ లను రంగంలోకి దించాలని ప్రయత్నాలు మొదలెట్టారు. అలా అప్పుడు మొదలెట్టిన ప్రయత్నాలు నెమ్మదిగా అన్ని రైళ్లకు కొత్తరకం కోచ్ లను తగిలించడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది.
LHB -లింకే హాఫ్ మన్ బుష్-జర్మనీ కంపెనీ
గంటకు 110 కిలోమీటర్లే మాగ్జిమమ్ వెళ్లగలిగే ICF కోచ్ ల స్థానంలో గంటకు 160 నుండి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే LHB కోచెస్ భారత ప్రభుత్వాన్ని ఆకర్షించాయి. జర్మనీకి చెందిన లింకే హాఫ్ మన్ బుష్ కంపెనీ తయారు చేసే బోగీలకు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి పంజాబ్ లోని కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రెడీ చేసిన బోగీలు ఇవి. ఇనుము స్థానంలో ఎక్కువగా అల్యూమినియం వాడడంతో ఇవి తేలికగా ఉంటాయి. అందువల్ల స్పీడ్ గా వెళ్లగలుగుతాయి. గంటకు 200 కి.మీ స్పీడ్ తో వెళ్లగలిగే అవకాశం ఉన్నా .. ట్రాక్ ల పరిస్థితుల దృష్ట్యా ఆ స్పీడ్ మెయింటైన్ చెయ్యడం లేదు. కానీ త్వరలో ట్రాక్ ల మార్పు తర్వాత ఆ స్పీడ్ అందుకోనున్నాయి రైళ్లు. ప్రస్తుతం టెస్ట్ చేసిన దాని ప్రకారం గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంది ఈ బోగీలతో చేసిన ట్రైన్. ఒక్క బోగీ తయారు చెయ్యాలంటే కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. మొదట్లో శతాబ్ది రైళ్లను మొదలు పెట్టి ఇప్పుడు దాదాపు అన్ని రైళ్లకూ ఇవే బోగీలను అమరుస్తున్నారు.
విశాఖ - అరకు రైలుకు
మొదట్లో దక్షిణ మధ్య రైల్వే ,ఈస్ట్ కోస్ట్ రైల్వే లోని విశాఖ డివిజన్ ల పట్ల చిన్నచూపు చూసేవారనే విమర్శలను ఎదుర్కొన్న రైల్వే ఇప్పుడు సౌకర్యవంతమైన బోగీల కోసం వస్తున్న డిమాండ్ ల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైళ్లకు కూడా LHB కోచ్ లనే తగిలించారు. విశాఖ పరిధిలో మొట్టమొదటి సారిగా వీటిని వైజాగ్ -అరకు రైలుకు అమర్చడం విశేషం. అద్దాలతో నడిచే విస్తాడోమ్ కోచ్ లు మినహా .. మిగిలిన కోచ్ లన్నీ LHB ర్యాక్ లే. ప్రస్తుతం ఏవో ఒకటిరెండు రైళ్లు మినహా దాదాపు అన్ని రైళ్లకూ ఇవే బోగీలు అమర్చారు. విశాలంగా ఉండే సీటింగ్ , సెల్ ఫోన్ ఛార్జింగ్ , మంచి వ్యూ ఉండేలా కిటికీలు, నీట్ గా ఉండే టాయిలెట్ లు, సామాను పెట్టుకోవడానికి సరిపోయే ప్లేస్ ఇలా ఆకట్టుకునే డిజైన్ లతో తయారైన LHB కోచెస్ ప్రస్తుత రైల్వే ముఖచిత్రాన్ని మార్చేశాయి అని చెబుతున్నారు అధికారులు. మరింత అడ్వాన్స్ గా ఉండే బులెట్ ట్రైన్స్ దేశమంతా చలామణీలోనికి రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అప్పటివరకూ రైళ్లు ఈ LHB కోచ్ ల తోనే నడవనున్నాయి.