Madhav Video Issue  :   హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వివరణ ఇచ్చారు. ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ వుండదన్నారు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికనే ప్రామాణికమని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఆ వీడియోని మూడో వ్యక్తి షూట్ చేశాడని.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ అని ఆయన చెప్పారు. రెండు ఫోన్‌లలో జరిగిన సంభాషణే ఒరిజినల్ అని సునీల్ కుమార్ తెలిపారు. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల చెప్పారని.. మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారని సునీల్ కుమార్ పేర్కొన్నారు. 


ఎక్లిప్స్ నిపుణుడి నుంచి వివరణ తీసుకున్నామన్న సీఐడీ 


తెలుగుదేశం పార్టీ నేతలు అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించి విడుదల చేసిన రిపోర్టుపైనా తాము విచారణ జరిపామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఆయన తేల్చిచెప్పారు.  ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్‌ని కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారని సీఐడీ చీఫ్ తెలిపారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని .. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్ తీసుకున్నారని సునీల్ కుమార్ పేర్కొన్నారు. వీడియో కంటెంట్ ఒరిజనలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదని.. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నామన్నారు. 


రిపోర్టును మార్చారని చెప్పారంటున్న సీఐడీ 


ఆ వీడియో ఒరిజినల్ అని చెప్పలేదని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుడు చెప్పారన్నారు. చెప్పిందన్నారు. రిపోర్ట్ ఇచ్చేటప్పుడే మార్పులు చేయాలని కోరారన్నారు. తాను నిర్ణయం తీసుకునే లోపలే రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారని.. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ ప్రకటించారు. నిపుణుడు ఇచ్చిన రిపోర్టును మార్పు చేస్తే విలువ ఉండదన్నారు. రిపోర్టును మార్చిన వారిపై ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ ప్రకటించారు.  ప్రైవేట్‌ ల్యాబ్స్‌ ఇచ్చే నివేదికలకు విలువ ఉండదు, మన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చే నివేదికనే ప్రామాణికం అని  సునీల్ కుమార్ తెలిపారు. 


ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని ప్రకటన


గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వెలుగులోకి రావడంతో పెను దుమారం రేగింది. ఆ వీడియోను ఫోరెన్సిక్ టెస్ట్ చేయిస్తామని నిజమని తేలితే మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్‌సీపీ నేత సజ్జల ప్రకటించారు. ఆ తర్వాత పలువురు ఆ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపామని చెప్పారు. కానీ అనంతపురం ఎస్పీ మాత్రం ఆ వీడియో ఒరిజినల్ కాదని.. ఫోరెన్సిక్‌కు పంపలేదని ప్రకటించారు. ఒరిజినల్ వీడియో అంటే   ఇద్దరి మధ్య జరిగిన రికార్డింగ్‌ ఒరిజినల్ అవుతుంది కానీ.. మూడో వ్యక్తి రికార్డు చేసేది ఒరిజినల్ కాదని చెబుతున్నారు  అసలు ఆ వీడియోను ఫోరెన్సిక్ టెస్ట్ చేయించకుండా... తాము అమెరికాలో టెస్ట్ చేయిస్తే.. తమ రిపోర్టుపై విచారణ చేయడమేమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా... తమకు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును ఫేక్ అని చెప్పడానికి సీఐడీ అధికారి రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం మాత్రం కొత్త మలుపులు తిరుగుతోంది.