Monkeypox Vaccine:
వందశాతం పని చేయాలని లేదు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం కాస్త తగ్గింది అనుకుంటుండగానే...మంకీపాక్స్ దాడి మొదలు పెట్టింది. ఇప్పటికే 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ మంకీపాక్స్ కలవరం కొనసాగుతోంది. ఈ వైరస్ కట్టడిపై అన్ని ప్రభుత్వాలూ మేధోమథనం సాగిస్తున్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కీలక వ్యాఖ్యలు చేసింది. మంకీపాక్స్ వ్యాక్సిన్‌లు 100% సమర్థంగా పని చేయవని తేల్చి చెప్పింది. వాటిపైనే ఆధారపడకుండా ఎవరికి వాళ్లు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించటం అవసరమని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లో 35 వేలకు పైగా కేసులు నమోదు కాగా..12 మంది మృతి చెందారు. "వ్యాక్సిన్‌లు మాత్రమే మంకీపాక్స్‌కు సరైన విరుగుడు అని పూర్తిగా విశ్వసించలేం. ఎవరికి వాళ్లు తాము ప్రమాదంలో ఉన్నామని భావించాలి. ఆ ముప్పుని వీలైనంత మేర తగ్గించుకోవాలి. వ్యాక్సిన్లు తీసుకుంటూనే జాగ్రత్తలు పాటించాలి" అని WHO టెక్నికల్ లీడ్ రోసాముండ్ లూయిస్ అన్నారు.
వారంలోనే పెరిగిన కేసులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం..గత వారంలో ప్రపంచవ్యాప్తంగా 7,500 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పోల్చుకుంటే..దాదాపు 20% మేర పాజిటివిటీ రేటు పెరిగింది. ఎక్కువ సంఖ్యలో యూరప్, అమెరికాలోనే కేసులు నమోదవుతున్నాయి. గతంలో పశ్చిమ, మధ్య ఆఫ్రికాలకే పరిమితమైన ఈ వైరస్..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతోంది. అమెరికా సహా పలు ఐరోపా దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లోనూ కేసులు నమోదు కాగా అంతర్జాతీయ ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని సూచించింది. జ్వరం, దద్దులు, లాంటి సింప్టమ్స్ ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని చెప్పింది. ఇలాంటి లక్షణాలు వేరే వ్యక్తిలో కనిపించినా వెంటనే ఆరోగ్య సిబ్బందికి చెప్పాలని సూచించింది. పచ్చిమాంసం తినటాన్ని కొద్ది రోజుల పాటు మానుకోవాలని తెలిపింది.
అరుదైన వ్యాధి ఇది..
నిజానికి...ఈ మంకీపాక్స్ వైరస్ చాలా అరుదైనది. అంత సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. తుమ్ము, దగ్గులు, గాలి ద్వారా ఇది వ్యాపించదన్నది నిపుణులు చెబుతున్న మరో విషయం. ఈ వైరస్ సోకిన వ్యక్తితో శారీరకంగా చాలా దగ్గరగా ఉంటేనే ఇదే సోకే ప్రమాదముంటుంది. ఆ సమయంలో ఈ వైరస్ నోరు, ముక్కు, కళ్లు, శ్వాసనాళం ద్వారా లోపలికి ప్రవేశించవచ్చు. అలాగే గాయాలైనప్పుడు చర్మం ఓపెన్ అయి ఉంటుంది. వైరస్ ఆ గాయం ద్వారా శరీరంలో చేరే అవకాశం ఉంది. మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమదేశాల్లో, మధ్య దేశాల్లో కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరిగిపోతాయి. తలనొప్పి, జ్వరం, వెన్ను నొప్పి, కండరాల నొప్పి, చలి, అలసట లాంటివి ప్రారంభదశలో కనిపించే లక్షణాలు. చికెన్ పాక్స్ ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి.
Also Read: Chiranjeevi Birthday Special: 30 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న చిరు బ్లాక్ బస్టర్ మూవీ
Also Read: janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!