అక్టోబర్‌ నుంచి చేపట్టే పాదయాత్ర, పొత్తుల అంశంపై కేడర్‌లో ఉన్న అనుమానాలు తీర్చేందుకు జనసేన సిద్ధమైందా... అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా ఎలాంటి కౌంటర్‌ ఇవ్వాలనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వబోతోందా... ఇంతకీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఏం చర్చించనుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోనంది... ఇప్పుడు జనసేనలో నడుస్తున్న చర్చ ఇదే. 


జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించాలని అధ్యక్షుడు పవన్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో జనసేన పార్టీ చేపట్టిన జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై డిజిటల్ ప్రచారం గురించి చర్చిస్తారని తెలుస్తోంది. 


ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలమైందని ఆరోపిస్తున్న జనసేన... దీనిపై ప్రత్యేకంగా చ‌ర్చ జరపనున్నట్టు సమాచారం. రాబోయే మూడు నెలల కాలంలో పార్టీ పరంగా చేపట్టబోయే కార్యక్రమాలపై కేడర్‌కు క్లారిటీ ఇవ్వబోతున్నారట. అక్టోబర్ 5న ప్రారంభంకానున్న పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటన విధి విధానాల రూపకల్పనపై సమగ్ర చర్చించనున్నారు. ఈ భేటీలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తోపాటు పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు.  


భ‌విష్యత్ కార్యచ‌ర‌ణపై క్లారిటి ఉంటుందా....


రాష్ట్రంలో రాజకీయ ప‌రిస్థితులు, పొత్తుల వ్యవ‌హ‌రంపై తీవ్రస్థాయిలో జనసేన పార్టీ పీఏసీలో చ‌ర్చ ఛాన్స్ ఉందని టాక్. ఈ విషయంలో జ‌న‌సేన, ప‌వ‌న్‌ను మంత్రులు, వైసీపీ లీడర్లు నేరుగా టార్గెట్ చేశారు. విమ‌ర్శల దాడి కూడా పెంచారు. అయితే అదే స్థాయిలో జ‌న‌సేన వాటిని తిప్పికొట్టేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజ‌ల్లోకి వెళ్ళలేక‌పోతున్నామ‌నే భావ‌నలో పార్టీ నేత‌ల్లో ఉంది. దీంతో కేడ‌ర్ కూడా తీవ్ర గంద‌ర‌గోళంలో ఉంటోంది. 


నియోజకవర్గంలోని జనసేన నేతల్లో కూడా డైలమా కనిపిస్తోంది. అభ్యర్దులు ఉంటారా.. ఉండ‌రా... పొత్తుల విష‌యంలో ఇప్పటికే ఉన్న నాయ‌క‌త్వానికి ఇబ్బందులు ఎదుర‌వుతాయా అనే అనుమానాలు వారిని కుదురుగా ఉండనియ్యడం లేదు. దీంతో ఎవ‌రికి వారే అన్న తీరులో లీడర్లు ఉంటున్నారు. 


ఈ ప‌రిస్థితుల‌ను అదిగ‌మించి పార్టీ నాయ‌కులకు, కార్యక‌ర్తల‌కు ప‌వ‌న్ ఎలాంటి భ‌రోసా ఇస్తారు. రాజ‌కీయంగా జ‌న‌సేన కీల‌కంగా మారేందుకు ఎలాంటి వ్యూహరచన చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. జనంలోకి వెళ్తున్నప్పుడల్లా మాకూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను రిక్వస్ట్ చేస్తున్నారు పవన్. ఆయన కనిపించినప్పుడల్లా సీఎం సీఎం అంటూ కేడర్‌ ఊగిపోతోంది. కానీ ఆయన వెళ్లిపోయిన మరుక్షణం సోషల్ మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఆ ఊపు కనిపించడం లేదు. ఏదో కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య రోడ్లు లాంటి ప్రజాసమస్యలపై కొంతమంది స్పందించినా రాష్ట్రవ్యాప్తంగా ఆ స్థాయి స్పందన రాలేదు. 


ఇప్పుడున్న పరిస్థితుల్లో జ‌న‌సేన‌, బీజేపి క‌లిస్తే ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే దానిపై తీవ్ర స్థాయిలో మాట్లాడుకుంటోంది జనసేన కేడర్. ఇలాంటి టైంలోనే ప‌వ‌న్ యాత్రకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర ప‌ర్యట‌నకు సమాయ‌త్తం అవుతున్న వేళ జ‌నానికి ప‌వ‌న్ ఎలాంటి హామీలు ఇస్తారు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని గ‌ద్దె దించేందుకు ప‌వ‌న్ చేసే ప‌ర్యట‌న ఎంత వ‌ర‌కు యూజ్ అవుతుందనే దానిపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అక్టోబ‌ర్ 5 నుంచి ఏపీలో చేపట్టే యాత్రకు అవ‌స‌రమైన రోడ్ మ్యాప్‌తోపాటుగా రాజ‌కీయంగా అనుస‌రించాల్సిన వ్యూహాలపై కూడా పీఎసీ స‌మావేశంలో క్లారిటి వ‌స్తుంద‌ని చెబుతున్నారు నాయకులు.