RBI on Payment Systems: చెల్లింపుల వ్యవస్థలు, వేదికలపై రుసుములు వసూలు చేయడంపై ఆర్బీఐ (RBI) మల్లగుల్లాలు పడుతోంది. ఛార్జీలు విధించడంపై ప్రజల అభిప్రాయాలను కోరింది. ఎలాంటి భారం లేకుండా ప్రజలంతా ఆన్‌లైన్‌ లావాదేవీలు చేపట్టేలా, చెల్లింపుల వ్యవస్థలోని సంస్థలకు ఆర్థికంగా బాసటగా నిలవాలన్న లక్ష్యంతో ప్రజాభిప్రాయ సేకరణకు దిగింది.


ప్రస్తుతం చెల్లింపుల వ్యవస్థలో ఇమ్మీడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (IMPS), నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (NEFT), రియల్‌ టైమ్ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (RTGS), యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ఉన్న సంగతి తెలిసిందే. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ సాధనాలు (PPI) సైతం ఇందులోకే వస్తాయి.


వ్యవస్థ పరంగా, ఆర్థిక పరంగా తలెత్తే ఒత్తిడి తగ్గించేందుకు ఆర్బీఐ 'చెల్లింపుల వ్యవస్థలో రుసుములు' అనే చర్చా పత్రాన్ని విడుదల చేసింది. చెల్లింపుల వ్యవస్థలపై రుసుములు విధించడంపై 40 ప్రశ్నలు విడుదల చేసింది. అక్టోబర్‌ 3లోగా వీటికి జవాబులు ఇవ్వాలని ప్రజలను కోరింది.


చెల్లింపుల వ్యవస్థలో ఎంతో మందికి భాగస్వామ్యం ఉంది. బ్యాంకుల నుంచి పేటీఎం వంటి యాప్‌ల వరకు ఇందులో భాగస్వాములే. అయితే లావాదేవీలు చేపట్టినప్పుడు విపరీతంగా, పారదర్శకత లేకుండా రుసుములు వసూలు చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే చెల్లింపు సేవలకు వసూలు చేసే ఛార్జీలు తక్కువగా ఉండాలని అలాగే మధ్యవర్తులకు ఆదాయం వచ్చేలా ఉండాలని కేంద్ర బ్యాంకు సూచిస్తోంది.


'ఆదాయం, రుసుముల మధ్య సమతూకం కోసం చెల్లింపుల వ్యవస్థల్లో వసూలు చేస్తున్న ఛార్జీలపై సమగ్ర సమీక్ష అవసరం. ఇందుకోసం ప్రజలు, సంస్థల స్పందన తీసుకోవాలి' అని ఆర్బీఐ తెలిపింది. ఒక లావాదేవీ చేపట్టినప్పుడు యూజర్లపై పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (PSPs) ఛార్జీలు వేస్తాయి. చెల్లింపుల వ్యవస్థలో వీటినే ఖర్చులుగా పరిగణిస్తారు. చేసిన లావాదేవీని బట్టి డబ్బు పంపిన లేదా పొందిన వారి నుంచి రుసుములు వసూలు చేస్తారు.


చెల్లింపుల వ్యవస్థలో నగదు బదిలీ చేపట్టినప్పుడు చెల్లింపుల ఆదేశం ఇచ్చిన వారి నుంచే ఛార్జీలు వసూలు చేస్తారు. అదే మర్చంట్‌ పేమెంట్‌ వ్యవస్థలోనైతే డబ్బు పొందిన వారు (వ్యాపారులు) రుసుములు చెల్లిస్తున్నారు. మొత్తంగా పేమెంట్‌ సిస్టమ్‌లో ఖర్చుల భారం వ్యాపారి లేదా వినియోగదారుడి పైనే పడుతోంది. అందుకే చెల్లింపుల వ్యవస్థలో రుసుములు భారీగా ఉండొద్దని, కస్టమర్లు సులువగా చేపట్టేలా  తక్కువగా ఉండాలని ఆర్బీఐ చెబుతోంది.