Vijayashanthi : ఆ పేరు ఎత్తితే చాలు శివంగిలా మారిపోతుంది. వెండితెర మీదే కాదు రాజకీయతెరమీద కూడా ఫైర్‌ ఫైర్‌ యామ్‌ ఫైర్‌ అంటూ ఎప్పుడూ ఆవేశంలో ఊగిపోయే విజయశాంతి మరోసారి తన స్టైల్లో మాటలతూటాలతో సిఎం కెసిఆర్‌ ని టార్గెట్‌ చేసింది. ఓ మీడియా ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్‌ గురించి కూడా చెప్పుకొచ్చారు.


కేసీఆర్‌వి తుపాకీ రాముడి కథలంటున్న విజయశాంతి ! 


ఒకప్పుడు కెసిఆర్‌ కి ముద్దుల చెల్లిలుగా కారుపార్టీలో షికారు కొట్టిన విజయశాంతి ఆ తర్వాత అన్నయ్యకి, పార్టీకి దూరం అయ్యారు. కారణం ఏంటన్నది పక్కాగా తెలియకపోయినా ఎప్పుడూ కెసిఆర్‌ పేరు ఎత్తినా సరే కాళీ మాతలా మారిపోతారు. తెలంగాణని తెచ్చింది.. రాష్ట్ర ఏర్పాటు చేసింది కెసిఆర్‌ దీక్ష వల్లే అన్న మాటల్లో నిజం లేదంటూ మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు గిలాంటి మాటలు వింటే నవ్విపోతారన్నారు. కెసిఆర్‌ దొంగదీక్షలు , ఉత్తుత్తి ఉద్యమాల గురించి తెలంగాణ జనాలకే కాదు యావత్‌ దేశ ప్రజలకు కూడా తెలుసునని చెప్పుకొచ్చారు. ఈ ముచ్చట ఎప్పుడూ ఉండేదే ..అందుకే ఆయన చెప్పేవన్నీ తుపాకీ రాముడి కతలంటూ  సెటైర్లు వేశారు. మనం అమాయకులమైతే  నెత్తిన టోపీ కూడా పెట్టే సమర్థత సిఎం కెసిఆర్‌ కి ఉందని ఎద్దేవా చేశారు. 


బీజేపీలోనూ ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి !


ఇక బీజేపీలో విజయశాంతి స్థానం ఏంటన్నదానిపైనా వివరణ ఇచ్చారు. పార్టీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నానా లేదా అన్న విషయం కమలం నేతలను అడిగి తెలుసుకోండని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇక ఎందుకు మీరు పార్టీ కార్యక్రమాలు, సభల్లో మౌనంగా ఉంటున్నారన్నదానికి స్పందిస్తూ నన్ను ఎందుకు మాట్లాడనివ్వడంలేదో తెలియదన్నారు. ఇది కూడా వారినే అడిగితే బాగుంటుందని సలహా ఇచ్చారు. పార్టీకి ఎల్లవేళలా సేవ చేసేందుకు నేను వెనకాడని చెప్పుకొచ్చారు. ఇక రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న విషయంపై స్పందిస్తూ నేను సిద్ధంగా ఉన్నాన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా నేను రెడీనే అని మనసులోని మాటని బయటపెట్టారు.


ఫైర్ బ్రాండ్‌కు సముచిత ప్రాధాన్యం లభిస్తుందా ? 


కెసిఆర్‌ పై విజయశాంతి విమర్శలు, ఆరోపణలు కొత్తకాకపోయినా బీజేపీ మాత్రం ఈ ఫైర్‌ బ్రాండ్‌ ని ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోవడం లేదన్నది వాస్తమంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఆవిడ మాటల్లోని  ఆవేశం.. చేతల్లోని దూకుడుతనాన్నిదూరంగా పెట్టడం వెనక ఏదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి. మొన్నా మధ్య జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో విజయశాంతి మాట్లాడుతుందని అందరూ భావించారు. అయితే కేవలం పెద్దలకు శాలువా కప్పి సత్కరించడానికే ఆవిడ సేవలను వాడుకున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పెద్దల తీరు ఇలానే ఉంటుందా లేదంటే మునుగోడులో విజయశాంతిని ప్రచారానికి దింపుతారా అన్నది త్వరలోనే తేలిపోతుంది.


విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా ఆమె తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతారు. టీఆర్ఎస్‌లో ఉన్నా.. ఆ పార్టీ తీరు నచ్చకపోతే విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లోనూ అంతే.. ! ఇప్పుడు బీజేపీలోనూ అదే అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. ముందు ముందు విజయశాంతి కీలక నిర్ణయాలు తీసుకుంటారా ? లేకపోతే సర్దుకుపోతారా అన్నది వేచి చూడాల్సిందే !