కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ అదే వ్యూహాన్ని ఇతర రాష్ట్రాలలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి అవినీతి ఆరోపణలు లేకుండా ఉన్న నేత మాణిక్‌ సర్కార్‌ బీజేపీ వ్యూహంతో ఓటమి పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు బీజేపీ, సంఘ్‌పరివార్‌ రెండేళ్ల పాటు కష్టం కూడా ఉంది. అయితే త్రిపురలో ఉన్న ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలించిన బీజేపీ పార్టీ అక్కడ విజయం సాధించేందుకు అనేక వ్యూహాలను అమలు చేసింది. అయితే అదే వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు అనువుగా ఎంచుకుంటుంది. 
ముందుగా ప్రతిపక్షం.. ఆ తర్వాతే అధికార పక్షం..
2013లో త్రిపురలో జరిగిన ఎన్నికల్లో సీపీఎం పార్టీ 49 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌ పార్టీ 10 సీట్లు గెలుచుకుంది. సీపీఐ పార్టీ ఒక సీటు కైవసం చేసుకుంది. సాధారణంగా కాంగ్రెస్‌ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ ఒక్కతాటిపై ఉండే అవకాశం లేదు. పైగా అసంతృప్తులు అధికమే. దాంతో ముందుగా కాంగ్రెస్‌లోని అసంతృప్తులపై కన్నేసిన బీజేపీ ఆ పార్టీ నుంచే చేరికలను  మొదలుపెట్టింది. ఇదే అదనుగా బీజేపీ ఆ రాష్ట్రంలో బలమైన పార్టీగా అవతరిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో రేకెత్తించింది. దీంతోపాటు నాలుగుసార్లు ఒకే ముఖ్యమంత్రి పాలనలో ఉన్న ప్రజల్లో సైతం సాధారణంగా అసంతృప్తి ఉంటుంది. లెప్ట్‌ పార్టీలకు చెందిన సెకండ్‌ క్యాడర్‌ను తన వైపు మలుచుకోవడంలో సక్సెస్‌ అయిన బీజేపీ తన విజయాలకు మార్గాన్ని సుగమం చేసుకుంది. 2013లో అసెంబ్లీలో జీరోగా ఉన్న బీజేపీ పార్టీ 2018 ఎన్నికల్లో 36 సీట్లు గెలుచుకోవడం గమనార్హం. ఈ వ్యూహంలో స్థానికంగా ఉన్న పార్టీలను కూడా తనవైపు కలుపుకొని ముందుకు సాగింది. ఇదే వ్యూహాన్ని కేరళలో అమలు చేసే విషయంలో విపలమైన కమలనాథులు ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు సిద్దమయ్యారనే ప్రచారం సాగుతుంది. 
కాంగ్రెస్‌ పార్టీ పిరాయింపులే..
తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొవాలన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన తప్పిదాలే ఇప్పుడు బీజేపీకి బలమయ్యాయి. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఇక లేదనే నినాదాన్ని టీఆర్‌ఎస్‌పార్టీ మొదలుపెట్టింది. సంస్థాగతంగా బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్‌ పార్టీని ప్రతిపక్షంలో సైతం ఉంచకుండా కేసీఆర్‌ చేసిన వ్యూహం బీజేపీకి కలిసొచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ లేదని టీఆర్‌ఎస్‌ చేసిన ప్రచారంను ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నయం అని బీజేపీ చెప్పుకునేలా కలిసొచ్చింది. 
హుజూరాబాద్‌తో మొదలు..
దక్షిణ భారత దేశంలో కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితమైన బీజేపీ కేరళలో పట్టుసాదించేందుకు విపలయత్నం చేసింది. అయితే తెలంగాణలో సానుకూల పరిస్థితి కోసం ఇప్పటి వరకు వేచి చూసిన ఆ పార్టీ హుజూరాబాద్‌ ఎన్నికలే తన వ్యూహం అమలుకు పునాదులు వేశాయి. టీఆర్‌ఎస్‌ పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్‌ పార్టీని వీడడం, ఆ తర్వాత బీజేపీలో చేరి విజయం సాధించడంతో బీజేపీకి అవకాశాలు అందేలా చేశాయి. దాంతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌కు జరిగిన ఎన్నికల్లో అధిక సీట్లు కైవసం చేసుకోవడంతో తెలంగాణలో తమ వ్యూహాన్ని అమలు చేయడం ఈజీగా బావించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ముందుగా పార్టీలో చేర్చుకుని ఉప ఎన్నికలకు తెరలేపింది. ఇక్కడ విజయం సాదిస్తే అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తులకు గాలం వేసి ఆ తర్వాత బీజేపీ తెలంగాణలో బలమైన పార్టీగా ప్రజలకు తెలిసేలా చేసి అధికారం చేజిక్కుంచుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ చేస్తున్న వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ ఛేదిస్తుందా.. లేక బీజేపీ విజయం సాధిస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే.