Anti Paper Leak Bill: నీట్‌ పేపర్ లీక్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రమంలో బిహార్ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇలాంటివి జరగకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తోంది. ఈ మేరకు  Bihar Public Examinations బిల్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. Prevention of Unfair Means గా ఈ బిల్‌కి పేరు పెట్టింది. పేపర్‌ లీక్‌లను ఆపడంతో పాటు మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు ఈ బిల్‌ రూపొందించింది ప్రభుత్వం. రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదిరి ఈ బిల్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వాయిస్ ఓటు ద్వారా బిల్‌ని పాస్ చేశారు. అయితే ప్రతిపక్ష నేతలు ఈ సమయంలో సభ నుంచి వాకౌట్ చేశారు. పోటీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌లకు అడ్డుకట్ట వేయడంతో పాటు క్వశ్చన్ పేపర్ లీక్‌లనూ అడ్డుకోవాలన్న లక్ష్యంతో బిల్ తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడినా, పేపర్ లీక్ చేసినా రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు 3-5 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. 






"బిహార్ ప్రభుత్వం పేపర్‌ లీక్‌ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చాం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ చట్టం ద్వారా మేలు జరుగుతుంది. వాళ్ల భవిష్యత్‌కి భరోసా ఉటుంది. నిందితులకు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. కోటి జరిమానా విధించాలని ప్రతిపాదించాం"


- విజయ్ కుమార్ చౌదిరి, బిహార్ మంత్రి


ఈ బిల్‌పై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. నీట్‌ వ్యవహారంపై ఓ వైపు విచారణ జరుగుతున్నా యాంటీ పేపర్ లీక్ బిల్‌ని తీసుకొచ్చి రగడ చేస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వం మంచి చేసినా అది అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. 






సుప్రీంకోర్టు సంచలన తీర్పు..


నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రీఎగ్జామ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పేపర్ లీక్‌ జరిగినట్టు స్పష్టం చేసింది. 155 మంది విద్యార్థులు ఈ పేపర్ లీక్‌ కారణంగా లబ్ధి పొందారని, వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని వెల్లడించింది.


Also Read: Viral Video: సముద్రంలో పడవపై ఒక్కసారిగా దాడి చేసిన భారీ తిమింగలం - వీడియో