INDIA Bloc Protests Against Budget: కేంద్ర బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.44.66 లక్షల కోట్ల పద్దుని అందించారు. ఈ బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. కేవలం కుర్చీని కాపాడుకునేందుకు ఇచ్చిన బడ్జెట్‌ అని సెటైర్లు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లో తమ నిరసన తెలిపాయి. ఇండీ కూటమిలోని పార్టీలకు చెందిన కీలక నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ తరపున అఖిలేష్ యాదవ్ ఈ నిరసనలో పాల్గొన్నారు. అంతకు ముందు మల్లికార్జున్ ఖర్గే నివాసం వద్ద ఇండీ కూటమి కీలక నేతలంతా హాజరయ్యారు. బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేసే విషయంలో ఓ నిర్ణయానికొచ్చారు.




ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్‌తో పాటు డీఎమ్‌కే ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు హాజరయ్యారు. జులై 27వ తేదీన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. అయితే.. బడ్జెట్‌ని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. రాజ్యాంగ విధానాలకు పూర్తి విరుద్ధంగా మోదీ సర్కార్ నడుచుకుంటోందని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. ఇలా వివక్ష చూపించే ప్రభుత్వం పెట్టే సమావేశానికి హాజరయ్యే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. రాహుల్ గాంధీ ఇప్పటికే బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కుర్చీ కాపాడుకోడానికి తెచ్చిన  బడ్జెట్‌ అని ఫైర్ అయ్యారు. మిత్రపక్షాలకు మాత్రమే మేలు చేసి మిగతా రాష్ట్రాలను మోసం చేశారని మండి పడ్డారు. కాంగ్రెస్‌ గతంలో ఇచ్చిన బడ్జెట్‌ లెక్కలు, మేనిఫెస్టోని కాపీ కొట్టి ఈ బడ్జెట్‌ని తయారు చేశారని ఆరోపించారు.