JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అనంతపురం వచ్చారు. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. బిఎస్ 4 వాహనాల కేసుకు సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, రవాణా శాఖ అధికారి శివరాం, మాజీ రవాణా శాఖ మంత్రి నాని, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ఆయన ఇద్దరు కుమారులు తదితరులపై వన్ టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. తాడిపత్రి నుంచి భారీ కాన్వాయ్‌తో అనంతపురం వన్ టౌన్‌కు చేరుకున్నారు. 


పోలీస్ స్టేషన్‌కు వచ్చిన జెసి ప్రభాకర్ రెడ్డి 
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ఆస్మిత్ రెడ్డి బిఎస్ 4 వాహనాలకు సంబంధించిన కేసు వివిధ పోలీస్ స్టేషన్‌లో నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారణకు ఈడీ స్వీకరించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసులు నమోదు చేయడమే కాకుండా తనకు సంబంధించిన ట్రావెల్స్ బస్సులను వివిధ కారణాలతో సీజ్  చేసి విధంగా ఆదేశాలు జారీ చేశారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా సుమారు 100 బస్సులు వివిధ ప్రాంతాల్లో షెడ్లలోనే నిలిచిపోయాయి. బస్సులన్నీ ప్రస్తుతం పనికిరాని స్టేజ్‌కు చేరుకున్నాయి. దీనంతటికీ రవాణా శాఖ అధికారులతోపాటు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపుతోనే చేశారని జెసి ప్రభాకర్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. బీఎస్‌4 వాహనాలు విక్రయించిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడం ఈ కేసు తిరిగి విచారణ చేయాలని జెసి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అనవసరంగా తమ కుటుంబాన్ని కేసుల్లో ఇరికించడమే కాకుండా తనని, కుమారుడు జెసి అస్మిత్‌ని జైలు పాలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అనేక సందర్భాల్లో హెచ్చరిస్తూ వస్తున్నారు.  


60 పేజీలతో ఫిర్యాదు చేసిన జెసి 
గత ప్రభుత్వంలో కొందరు నేతలు అధికారులు జెసి ప్రభాకర్ రెడ్డిపై ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అక్రమ కేసుల ఎపిసోడ్‌కి సంబంధించి 2019 నుంచి జరిగిన వ్యవహారాలపై 60 పేజీలతో ఫిర్యాదులు తయారు చేశారు. 12 సెట్లు అనంతపురం వన్ టౌన్ పోలీసులకు అందించిన అనంతరం అక్కడి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి జెసి ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. ప్రతి కంప్లైంటుకు ప్రశ్న జవాబు సాక్షాన్ని జోడించి ఇచ్చారు. పకడ్బందీగా కేసులకు సంబంధించి సాక్ష్యాలు అన్ని పత్రాలను జోడించి ఇవ్వడం వల్ల మరోసారి దానిమీద విచారణ చేయకుండా కేవలం క్రాస్ చెక్ చేసుకుని కేసు నమోదు చేయడానికి వీలు ఉండే విధంగా అన్ని ఆధారాలు సమర్పించారు. ఉదయం 11 గంటలకు అనంతపురం చేరుకొని ఫిర్యాదులు చేశారు. ఇందులో అధికారుల ప్రమేయం గురించి వారికి సంబంధించిన వివరాలపై ఆధారలతో సమర్పించారు. 


భారీ కాన్వాయ్‌తో జిల్లా కేంద్రానికి జెసి రాక 
ఫిర్యాదు చేయడానికి జిల్లా కేంద్రానికి జెసి ప్రభాకర్ రెడ్డి భారీ కాన్వాయతో తాడిపత్రి నుంచి వచ్చారు. సుమారుగా తనతోపాటు తన అనుచరులు 60 వాహనాలకుపైగా వచ్చారు. అసెంబ్లీ జరుగుతున్న టైంలో శాంతిభద్రల దృష్టిలో పెట్టుకొని కొన్ని వాహనాలను నగరంలోకి అనుమతి ఇవ్వలేదు. కొంతమందిని మాత్రమే అనుమతించారు. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన మండలాల నుంచి పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు భారీ కాన్వాయ్‌తో తరలి వచ్చారు. ఎల్లనూరు, పుట్లూరు నుంచి నాయకులు కార్యకర్తలు తమ వాహనాల్లో ఆయన వెంట కదిలారు.