Whale Attacks Boat in Sea: నడి సముద్రంలో ఒక్కసారిగా భారీ తిమింగలం వచ్చి పడవపై అటాక్ చేస్తే ఎలా ఉంటుంది. భయంతో గడగడ వణుకు పుడుతుంది. అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్‌లో ఇదే జరిగింది. ఓ చిన్న పడవ సముద్రంలో ఉండగా ఉన్నట్టుండి ఓ భారీ తిమింగలం వచ్చి ఆ పడవపై దాడి చేసింది. ఈ దాడిలో పడవ మునిగిపోయింది. వెనక పడవలో ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు వెల్లడించారు. కేవలం పడవ ధ్వంసమైందని తెలిపారు. ఆ సమయంలో పడవలో ఉన్న ఇద్దరూ తిమింగలం దాడి చేయగానే వెంటనే నీళ్లలో దూకారు. ఓ వ్యక్తి కాస్త దూరంగా పడిపోగా మరో వ్యక్తి నీళ్లలో మునిగిపోయాడు. మొత్తానికి ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.





జులై 23వ తేదీన X లో ఓ నెటిజన్‌ ఈ వీడియో షేర్ చేశాడు. ఇప్పటికే 37 లక్షల వ్యూస్ రాగా వందలాది కామెంట్స్ వచ్చాయి. వెనక పడవలో ఓ బాలుడు కనిపించాడు. "ఆ పిల్లాడు బానే ఉన్నాడా..? ఏం జరిగింది" అని చాలా మంది నెటిజన్‌లు కామెంట్స్‌లో అడుగుతున్నారు. సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా లైఫ్‌ జాకెట్‌లు వేసుకోవాలని ఇంకొందరు సూచించారు. ప్రాణాపాయం నుంచి బయట పడ్డ ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. అదృష్టవశాత్తూ బతికామని చెప్పారు.