Kathmandu Plane Crash Video: నేపాల్‌ని ఖాట్మండు ఎయిర్‌పోర్ట్‌లో విమానం కుప్ప కూలింది. టేకాఫ్ అవుతుండగానే ప్రమాదానికి గురైంది. ఫ్లైట్‌లో సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణిస్తున్నారు. వీళ్లంతా చనిపోయి ఉంటారని భావించారు. పైలట్ మాత్రం అనూహ్యంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతానికి మృతదేహాల్ని ఘటనా స్థలం నుంచి తరలిస్తున్నారు. స్థానిక మీడియా మాత్రం మిగతా 18 మంది చనిపోయారని వెల్లడించింది. అయితే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎలా ప్రమాదానికి గురైందో ఇందులో స్పష్టంగా కనిపించింది. టేకాఫ్ అయిన ఫ్లైట్‌ ఓ వైపు ఒరిగిపోయింది. వేగంగా వచ్చి నేలపై కుప్ప కూలింది. అలా కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 11.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. నేపాల్ మిలిటరీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. 






అసలు ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదు. అయితే..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఈ ఘటన షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ భద్రతా ప్రమాణాలున్న ఎయిర్‌లైన్స్‌గా నేపాల్‌కి పేరుంది. పైలట్‌లకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం, నిర్వహణ సరిగ్గా లేకపోవడం లాంటి సమస్యలతో నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే ఐరోపా సమాఖ్య నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఏ విమానమూ తమ గగనతలంలోకి రావడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పూర్తిగా నిషేధం విధించింది. ఇక భౌగోళిక స్థితిగతులూ ఇక్కడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హిమాలయాల ప్రాంతంలో ఉండడం వల్ల చుట్టూ కొండలు, లోయల మధ్యలో ఎయిర్‌పోర్ట్‌లు కట్టుకోవాల్సి వస్తోంది. అవి చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి. ఇలాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పుడు పైలట్‌లకు ఇంకాస్త ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇదే జరగడం లేదు. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. ఇన్ని సవాళ్ల మధ్య ఫ్లైట్‌ సర్వీస్‌లు నడపాల్సి వస్తోంది.






శౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన Bombardier CRJ-200ER ఫ్లైట్‌ ఈ ప్రమాదానికి గురైంది. 2003లో తయారైన ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఇంకా నడుపుతున్నారు. అయితే..2019లోనే భారత్‌కి చెందిన కుబేర్ గ్రూప్ ఈ ఎయిర్‌లైన్స్‌ని కొనుగోలు చేసింది. 2021లోనే ఎయిర్‌లైన్స్ పేరు మార్చి కుబేర్ ఎయిర్‌లైన్స్‌గా ప్రకటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థ 2018లో ఓ సారి సర్వీస్‌లను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోందనుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.


Also Read: Plane Crash: ఖాట్మండ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం, టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం - పైలట్ మినహా 18 మంది మృతి