Nepal Plane Crash: నేపాల్‌లోని ఖాట్మండులో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్ప కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే శౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ప్రమాదానికి గురైనట్టు అక్కడి మీడియా వెల్లడించింది. సిబ్బందితో సహా మొత్తం 19 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందింది.
ఈ ప్రమాదంలో పైలట్ తప్ప మిగిలిన 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి మీడియా ప్రకటించింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన CRJ200 ఫ్లైట్ టేకాఫ్ అయినప్పుడు పైగి ఎగిరేందుకు అవసరమైన ఆల్టిట్యూడ్ రాలేదు. ఆ సమయంలోనే రన్‌వేపై స్లిప్ అయింది. వెంటనే కుప్ప కూలింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడం వల్ల ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. పైలట్ ఒక్కడే అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. Tribhuvan International Airport లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఎయిర్‌పోర్ట్ చుట్టూ భారీ లోయలున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌పోర్ట్ ఇదే. పైగా నేపాల్ ఎయిర్‌లైన్స్‌కి ఇలాంటి ప్రమాదాల రికార్డ్ భారీగానే ఉంది. ఫలితంగా తరచూ ఇలాంటి ప్రమాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది నేపాల్. ప్రస్తుతం పోలీసులతో పాటు నేపాల్ మిలిటరీ, అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తం 18 మంది మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన పైలట్‌కి చికిత్స అందిస్తున్నారు.
ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. పోలీసులూ పెద్ద ఎత్తున మొహరించారు. నేపాల్‌లో ఏటా ఓ విమాన ప్రమాదం జరుగుతూనే ఉంది. 2010 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 12 ఘోర ప్రమాదాలు జరిగాయి. పెద్ద ఎత్తున ప్రాణనష్టమూ వాటిల్లింది. గతేడాది జనవరిలో Yeti Airlines కి చెందిన ఫ్లైట్ పొఖారా వద్ద ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో విమానంలో ఉన్న 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ లోయలో పడిపోయిన విమానం తునాతునకలైపోయింది. అంతకు ముందు 2022లో మే 29వ తేదీన తారా ఎయిర్ లైన్‌కి చెందిన ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. 22 మంది మృతి చెందారు.
Also Read: Plane Crash: ఖాట్మండ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎలా కూలిపోయిందో చూశారా, ప్రమాద దృశ్యాలు వైరల్