Woman Abused: పారిస్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆస్ట్రేలియాకి చెందిన మహిళపై ఐదుగురు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒలిపింక్స్‌కి ముందు జరిగిన ఈ ఘటన అక్కడి సెక్యూరిటీపై అనుమానాలు పెంచింది. జులై 20వ తేదీన అర్ధరాత్రి ఈ అత్యాచారం జరిగింది. అయితే...ఓ సీసీటీవీ ఫుటేజ్‌లో బాధితురాలు కనిపించింది. అత్యాచారం జరిగిన తరవాత ఓ షాప్‌ వద్ద ఆగింది. బట్టలు చినిగిపోయి ఉన్నాయి. షాప్‌లో ఆశ్రయం కావాలని ఓనర్‌ని బతిమాలింది. అయితే...ఈ ఘటన జరగక ముందు మహిళ రాత్రంతా బార్‌లు, క్లబ్‌లలో గడిపిందని, మద్యం సేవించిందని విచారణలో తేలింది. సరిగ్గా అదే సమయంలో ఓ చోట అడ్డగించిన ఐదుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులకు వివరించింది బాధితురాలు. ఏదో విధంగా వాళ్ల నుంచి తప్పించుకుని వచ్చి  ఓ షాప్ వద్ద ఆగినట్టు వెల్లడించింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 




బాధితురాలు చాలా కంగారుగా షాప్‌లోకి వచ్చింది. సాయం కావాలని షాప్ ఓనర్‌తో మాట్లాడింది. ఆమె వెంట పడుతూ అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిలో ఒకరు షాప్ వరకూ వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెడుతున్నట్టుగా నటించాడు. వెంటనే ఆ మహిళను వెనక నుంచి పట్టుకోబోయాడు. అలెర్ట్ అయిన షాప్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు. కానీ వాళ్లని విదిలించుకుని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తరవాత షాప్ సిబ్బంది పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించారు. బాధితురాలిని హాస్పిటల్‌కి తరలించారు. ఆస్ట్రేలియాకి చెందిన మహిళపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలు షాక్‌లో ఉందని, ఘటనకు సంబంధించి వివరాలు ఏమీ చెప్పలేకపోతోందని తెలిపారు. అయితే...ఈ సీసీటీ ఫుటేజ్‌ సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.