Kuwait Divorce Viral News: వివాహబంధం చాలా గొప్పది.. నూరేళ్లు కలిసి ఉంటామని పెళ్లి చేసుకుంటారు.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. పెళ్ళైన జంటలు కూడా నచ్చితే ఒకే.. లేకుంటే ఎవరిదారివారిది అంటున్నారు.. ఒకసారి వద్దనుకుంటే ఇక ఎవరి మాట వినరు.. విడాకులు తీసుకొని ఎవరిలైఫ్ వాళ్లు బ్రతుకుతున్నారు.. పాశ్చ్చాత్య దేశాలలో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది.. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతున్నారు..
పెళ్లంటే నూరేళ్ల పంట, దంపతులిద్దరూ కష్టసుఖాల్లో పాలు నీళ్లలా కలిసుండాలని చెబుతుంటారు మన పెద్దోళ్లు. కానీ ఇదంతా గతం. నేటి తరం వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని గుర్తించలేక చిన్న చిన్న పొరపాట్లకే భేషజాలకు పోయి వివాహ బంధాలను తృణప్రాయంగా కాదనుకుని వెళ్లిపోతున్నారు.
2019లో జరిగిన ఘటన
కువైట్‌లోని ఓ జంట వివాహం చేసుకున్న మూడు నిమిషాల్లో విడాకులు తీసుకుని చరిత్రకెక్కింది. భర్త చేసిన చిన్నపనికి భార్య అతన్ని వద్దనుకుని వివాహం చేసుకున్న చోటనే విడాకులు తీసుకుని ఆశ్చర్యపరిచింది. ఈ పెళ్లి కువైట్ చరిత్రలోనే షార్టెస్ట్ మ్యారెజ్‌గా నిలిచింది. 2019 లో జరిగిన ఈ ఘటన తాజాగా ఒక వ్యక్తి ఎక్స్‌లో పెట్టిన పోస్టుతో మళ్లీ వైరల్‌గా మారింది.
గల్ఫ్ దేశం కువైట్‌కు చెందిన ఓ యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని బంధువులు, సన్నిహితులతో కలిసి కోర్టులో వివాహం చేసుకునేందుకు సన్నిహితులతో కలిసి వెళ్లారు. అందరి ఆశీస్సులతో వివాహం చేసుకున్న ఈ జంట సంతోషంగా బయటకొచ్చింది. ఈ క్రమంలో మెట్లు దిగుతూ భార్య కిందపడిపోయంది. అయితే వరుడు ఆమెను పట్టుకోకుండా స్టుపిడ్ అని తిట్టాడు. దీంతో ఒక్కసారిగా కోపం కట్టలుతెంచుకున్న వధువు ఎక్కడైతే వివాహం చేసుకుందో తిరిగి అక్కడికే వెనక్కి వెళ్లి విడాకుల కోసం అభ్యర్థించింది. కారణం ఏంటని ప్రశ్నించగా తాను మెట్టు జారి కింద పడిపోతుంటే పట్టుకోవడం మానేసి స్టుపిడ్ అని అందరి ముందూ తిట్టి అవమానించాడని వాపోయింది. పెళ్లి జరిగిన కొద్ది క్షణాల్లోనే తనపై సాధింపులు మొదలయ్యాయని భవిష్యత్తుని ఊహించుకుని విడాకులు మంజూరు చేయాలని కోరింది. ఆమె కోరుకున్నట్టుగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
ఎక్స్ లో పోస్టుతో వైరల్
తాజాగా ఓ వ్యక్తి వివాహానికి హాజరైనప్పుడు తనకు ఎదురైన ఈ అనుభవాన్ని పై విధంగా ఎక్స్‌లో రాసుకొచ్చాడు. దీంతో 2019లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు 3 నిమిషాల్లో విడాకులు అంటూ మరోసారి వైరల్‌గా మారింది. ఇద్దరికీ సరిపడదని అనుకున్నప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా వేరుకావడం ఉత్తమమని తన అభిప్రాయం కామెంట్ చేశాడు.
కాగా 2004లో యూకేలో ఒక జంట పెళ్లైన 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. రిజిస్టర్ ఆఫీస్‌లో స్కాట్ మెక్కీ, విక్టోరియా ఆండర్సన్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ తోటి పెళ్లికూతుళ్లను ఇబ్బంది పెట్టినందుకు పెళ్లి కొడుకుపై వధువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరగడంతో విడాకులు తీసుకుంది.
మనదేశంలో విడాకుల రేటు 1 శాతమే
సంబంధాలను కాపాడుకోవడంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటు తక్కువగా ఉంది.. ప్రపంచవ్యాప్త గణాంకాలను విశ్లేషించే గ్లోబల్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం, భారతదేశంలో విడాకుల రేటు కేవలం 1 శాతం మాత్రమే నమోదైంది. భారతదేశం తర్వాత, వియత్నాం రెండవ అత్యల్ప విడాకుల రేటు 7 శాతంగా పేర్కొంది..
పోర్చుగల్ లో అత్యధిక విడాకుల రేటు
ప్రపంచంలో అత్యధిక విడాకుల రేటు 94 శాతం పోర్చుగల్‌లో నమోదైంది. ఖండాల పరంగా, యూరప్ అత్యధిక విడాకుల రేటును నమోదు చేస్తుంది. పోర్చుగల్ తర్వాత స్పెయిన్ విడాకుల రేటు 85 శాతంగా ఉంది. లక్సెంబర్గ్, ఫిన్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్ మరియు స్వీడన్‌తో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా విడాకుల రేటును 50 శాతానికి మించి నమోదు చేశాయి.. ఇక యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా ఒకే విధమైన విడాకుల రేటును పంచుకుంటాయి, దాదాపు 50 శాతం వద్ద ఉన్నాయి..