Mayawati on Bharat Jodo Yatra:


మాయావతి ట్వీట్..


రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర రేపటి నుంచి (జనవరి 3) యూపీలో ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రంలోని కీలక నేతలందరికీ కాంగ్రెస్ ఆహ్వానం పంపుతోంది. ఇందులో భాగంగానే...బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి ఇన్విటేషన్ పంపింది. ఆమె వస్తారా రారా అన్న సస్పెన్స్‌కు తెర దించుతూ ట్వీట్ చేశారు మాయావతి. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపిన ఆమె..భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకున్నారు. "భారత్ జోడో యాత్రకు నా శుభాకాంక్షలు. యాత్రలో పాల్గొనేందుకు ఆహ్వానం పంపిన రాహుల్ గాంధీకి నా ధన్యవాదాలు" అని ట్వీట్‌ చేశారు. ఘజియాబాద్‌లోని "లోని" నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎస్‌పీ ఎమ్మెల్యే శివపాల్‌ సింగ్ యాదవ్, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, సీపీఐ సెక్రటరీ అతుల్ అంజన్‌ లాంటి కీలక నేతలందరికీ ఇన్విటేషన్ పంపింది కాంగ్రెస్. 






బీజేపీ నేతలకూ ఇన్విటేషన్ 


వీరితో పాటు బీజేపీ నేతలకూ ఆహ్వానం అందింది. బీజేపీ నేత దినేశ్ శర్మను ఆహ్వానించింది. కేంద్ర హోం మంత్రి స్మృతి ఇరానీకి కూడా కాంగ్రెస్ ఇన్విటేషన్ ఇచ్చింది. యూపీలో జరిగే యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ నేత,మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ నేరుగా వెళ్లి స్మృతి ఇరానీ సెక్రటరీకి  ఆహ్వానం అందించారు. ఇదే విషయాన్ని గౌరీ గంజ్‌లో క్యాంప్‌లో వెల్లడించారు దీపక్ సింగ్. అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాను కేంద్రమంత్రికి ఇన్విటేషన్ పంపినట్టు చెప్పారు. "అందరి కన్నా ముందు స్మృతి ఇరానీకి ఇన్విటేషన్ పంపాలని అధిష్ఠానం నాకు సూచించింది" అని స్పష్టం చేశారు. అయితే..దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. బీజేపీ తరపున ఏ ఒక్కరూ భారత్ జోడో యాత్రలో పాల్గొనే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భారత దేశ ఐక్యత కోసం బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. దేశం ముక్కలు కాలేదని, వాళ్లు జోడో యాత్ర అంటూ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. 


అఖిలేష్ కామెంట్స్..


భారత్ జోడో యాత్రపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఐడియాలజీతో పోల్చుకుంటే...తమ పార్టీ (సమాజ్‌వాదీ) ఐడియాలజీ పూర్తిగా వేరు అని వెల్లడించారు. "మాకెలాంటి ఆహ్వానం అందలేదు. బీజేపీ, కాంగ్రెస్ ఐడియాలజీ ఒకటే. మా ఆలోచనా విధానం పూర్తిగా వేరు" అని అన్నారు. అయితే...భారత్ జోడో యాత్రకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్, ఎస్‌పీ జత కట్టాయి. 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కలిసి పోటీ చేశాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేరు పడ్డాయి.


Also Read: Khanjawala Case: కంజావాలా కేసులో నిందితులు అరెస్ట్, విచారణలో కీలక విషయాలు