తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలకు హౌస్ అరెస్టులు చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బయటకు రారని, సామాన్యులకు కూడా ప్రగతి భవన్‌లోకి ప్రవేశం ఉండబోదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు కేసులు పెడుతున్నారని, తమని హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తమను గృహ నిర్బంధాలు చేసినా ఎదుర్కొంటామని చెప్పారు. రాష్ట్రంలో సర్పంచ్‌ల దుస్థితికి వ్యతిరేకంగా ధర్నా చేయకుండా పోలీసులు తన ఇంటిని, కాంగ్రెస్ నాయకులు అందరినీ చుట్టుముట్టారని అన్నారు. ప్రజాస్వామ్యమా ఎక్కడున్నావు? అని రేవంత్ ప్రశ్నించారు. దాంతో పాటు హిట్లర్ కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జతచేశారు.


ఇక సర్పంచ్ ల సమస్యలపై ధర్నాకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసు హౌస్ అరెస్టులు చేయడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీ్ట్ చేశారు. కేసీఆర్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో రాస్తారోకో చేయాలని అన్నారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేయాల్సిందిగా శ్రేణులకు పిలుపు ఇస్తున్నానని చెప్పారు.


‘‘కేసీఆర్ ప్రైవేటు ఆర్మీ తరహాలో పోలీసులు మా ఇళ్లలోకి చొరబడ్డారు. మా ఇళ్లలోకి పోలీసులు చొరబడి మమ్మల్ని ఎత్తుకెళ్లడం మనం ఎన్నో ఆశలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో రౌడీ రాజ్యానికి నిదర్శనం’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.