Congress Protest: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న ఆయనను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ పోలీసులను నిలదీశారు. మీకు అంతగా అభ్యంతరం ఉంటే ధర్నాచౌక్ వద్దకు వెళ్లాక అరెస్ట్ చేయాలని సూచించారు. 






సర్పంచుల నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు ఇందిరా పార్కు వద్ద జరగాల్సిన ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ తాము ధర్నా చేస్తామని కాంగ్రెస్ నేతలు తెగేసి చెప్పడంతో.. ఈరోజు ఉదయం నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలను బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారి ఇళ్ల వద్దకు వెళ్లి భారీ సిబ్బందితో పహారా కాశారు. చాలా మందిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ముందుగా బయటకు వెళ్లే పరిస్థితి లేదని భావించిన రేవంత్ రెడ్డి చాలా సేపు ఇంట్లోనే ఉండిపోయారు. చివరకు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల నిర్బంధాన్ని కాదని గేటు దూకి బయటకు రాబోయారు. అయినా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.  






ఉదయం నుంచీ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధాలు..


రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. సర్పంచుల నిధుల సమస్యలపై హైదరాబాద్ లోని ధర్నా చౌక్ చేపట్టే ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత వి. హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి తదితరులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని నేతల ఇంటి దగ్గర భారీ సిబ్బందితో పోలీసులు పహారా కాస్తున్నారు.