కందుకూరు, గుంటూరులో వరుసగా జరిగిన దుర్ఘటనల్లో మొత్తం 11 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిలో కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని వేడెక్కించాయి. ఈ రెండు తొక్కిసలాటలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న సభల్లోనే జరగడంతో వైసీపీ విమర్శల వాడి పెంచింది.
చంద్రబాబు ప్రచారం పిచ్చి కారణంగానే నాలుగు రోజుల వ్యవధిలోనే 11 మంది చనిపోయారని విమర్శిస్తున్న వైఎస్‌ఆర్ సీపీ... పవన్ కల్యాణ్‌ను కూడా టార్గెట్ చేసుకుంది. గతంలో జరిగిన విషయాలతో వీటికి ముడిపెడుతూ మాట్లాడకుండా ఎక్కడ దాక్కున్నారని నిలదీస్తోంది. పవన్‌పై విమర్శలకు ఎప్పుడూ ముందు ఉండే పేర్ని నాని... మరోసారి జనసేన అధినేతపై విరుచుకుపడ్డారు.
ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకి ఉన్నటువంటి విలువ, కందుకూరులో 8మంది, గుంటూరులో ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేవా అన్నట్టు పవన్‌ను ప్రశ్నించారు. నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో చెప్పాలని నిదీశారు. ఎక్కడా పవన్ పేరు ప్రస్తావించకుండానే పేర్ని నాని విమర్శలు చేశారు. కానీ ఇప్పటం విషయం లేవనెత్తడంతో ఈ విమర్శలు పవన్ పైనే అని క్లారిటీ ఇచ్చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ, జగన్‌ను సపోర్ట్ చేసే సోషల్ మీడియాలో కూడా పవన్‌పై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పడు ఎక్కడ దాక్కున్నావంటూ నిలదీస్తున్నారు.
ఈ విమర్శలపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు కూడా ఘాటు రియాక్ట్ అవుతున్నారు. విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తుండటంతో సోషల్ మీడియా దుమ్ముదుమారం అవుతోంది.