New Year Hotel Booking:


ఇంగ్లిష్‌ న్యూ ఇయర్‌ వేడుకలు అనగానే గుర్తొచ్చే గమ్యస్థానం గోవా! డిసెంబర్‌ 31 రాత్రి సంబరాలు జరుపుకొనేందుకు ఎక్కువ మంది ఈ పర్యాటక ప్రాంతానికే ఓటేస్తారు. అలాంటిది ఈ సారి గోవాను దాటేసింది వారణాసి. పరమ పవిత్రమైన కాశీ విశ్వనాథుడి సన్నిధిలోనే ఉండేందుకే చాలామంది మొగ్గుచూపారు. ఓయో స్థాపకుడు, సీఈవో రితేశ్ అగర్వాల్‌ ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు.




ఓయో యాప్‌లో డిసెంబర్‌ 31 రాత్రి వారణాసిలో హోటల్‌ గదులను బుక్‌ చేసుకొనేందుకు ఎక్కువ మంది ప్రయత్నించారని ఓయో అధినేత రితేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. 'గోవాలో బుకింగ్స్‌ గంట గంటకు పెరుగుతున్నాయి. అయితే దీనిని ఏ నగరం దాటేస్తుందో మీరు ఊహించగలరా! వారణాసి' అని ఆయన ట్వీట్‌ చేశారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 700కు పైగా నగరాల్లో ఓయో గదులు బుక్‌ చేసుకున్నారని వెల్లడించారు.


ఓయో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. మలేసియా, బ్రిటన్‌, చైనా, ఇండోనేసియా, అమెరికా, ఐరోపా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ఓయో ద్వారా గదులు బుక్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 31 వేడుకల సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 450K కన్నా ఎక్కువ బుకింగ్స్‌ జరిగాయని, గతేడాదితో పోలిస్తే 35 శాతం కన్నా ఎక్కువని రితేశ్‌ అన్నారు. 'చివరి ఐదేళ్లలో ఒకరోజులో అత్యధిక బుకింగ్స్‌ నేడు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 750 పైగా నగరాల్లో 50 శాతానికి పైగా బుకింగ్స్‌ పెరిగాయి' అని ఆయన ట్వీటారు.




కరోనా కష్టాలు తొలగిపోవడంతో భారత్‌లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. దాంతో ఓయోకు గిరాకీ పెరిగింది. కాగా ఐపీవోకు వచ్చే ముందు కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. మొత్తం 3700 ఉద్యోగుల్లో 600 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్‌, కార్పొరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌, ఓయో వొకేషన్‌ టీమ్స్‌లో కొందరిని తీసేసింది. బహుశా 2023 ద్వితీయార్థంలో ఓయో ఐపీవోకు రావొచ్చు.